జాతీయ రహదారుల ప్రాజెక్టుల అధికారిక శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రసంగానికి బీజేపీ కార్యకర్తలు శుక్రవారం ఆటంకం కలిగించారు. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, జి కిషన్ రెడ్డి, వీకే సింగ్ సమక్షంలో ఈ ఘటన జరిగింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభించగానే కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని జీఎంఆర్ ఎరీనాలో ఈ కార్యక్రమం జరిగింది.
తెలంగాణలోని వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుని అధికారిక కార్యక్రమానికి భంగం కలిగించవద్దని బీజేపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఓ అధికారిక కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని భావిస్తున్నారు. రాష్ట్రంలోని అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష బిజెపి నాయకుల మధ్య వివిధ సమస్యలపై కొనసాగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఘటన చోటుచేసుకుంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్ నేతలు కాషాయ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబ పాలన అంటూ టీఆర్‌ఎస్‌పై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.