ఎమ్మెల్యే రాజా సింగ్ ఆవేశంలో విచక్షణ కోల్పోయి మాట్లాడారని మాజీ ఎంపీ, బీజేపీ నేత రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. రాజా సింగ్ కూడా తన వ్యాఖ్యల పట్ల విచారంలో ఉన్నాడని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై రాపోలు ఆనంద భాస్కర్ స్పదించారు. అవినీతికి, అక్రమార్జనకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడివరకు వెళ్లడంలో ఆశ్చర్యం లేదని అన్నారు. ఆరోపణలతోనే ముందస్తుగా నిందలు వేయాల్సిన అవసరం లేదని.. ఢిల్లీ లిక్కర్ పాలసీ అక్రమాలపై చట్టబద్ధంగా సీబీఐ దర్యాప్తు జరుపుతుందని అన్నారు.
సిబిఐ దర్యాప్తులో అన్ని అంశాలు బయటపడతాయన్నారు. ఆధారాలు లేకుండా దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్లవని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగానే పనిచేస్తాయని తెలిపారు. తొందర పాటు చర్యలు ప్రజాస్వామ్యంలో నిలబడవని అన్నారు. కక్ష సాధింపు చర్యలు అనే ఆరోపణలు అధికార పక్షం ఎదుర్కొవడం సాధారణ అంశమని పేర్కొన్నారు. అధికార పక్షం కింద అధికార యంత్రాంగం, దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయి కాబట్టి ఆరోపణలు రావడం సహజమని అన్నారు.