ధాన్యం సేకరణ విషయంలో టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నారు బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణపై బీజేపీ ప్రజల్లోకి వెళ్తోందని అన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్తే.. బీజేపీ తెలంగాణ గ్రామాల్లోని గల్లీకి వెళ్తోందని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ విషయంలో కేసీఆర్ కుట్రను ప్రజల ముందుంచుతామని అన్నారు. డిల్లీ వర్సెస్ కేసీఆర్ అనే విధంగా సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేకిగా బీజేపీపై ముద్రవేయటం కేసీఆర్ తరం కాదని అన్నారు. ఎనిమిదేళ్ళుగా కేంద్రం కొనకుంటే ధాన్యం ఎరవరు కొంటున్నారో కేసీఆర్ చెప్పాలి? అని ప్రశ్నించారు. ఈ విషయమై వదిలే ప్రసక్తే లేదని.. బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ ను కొలిమిలో నిలబెడతారని.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని అన్నారు. అగ్రిమెంట్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయటానికి కేంద్రం సిద్ధంగా ఉందని మురళీధర్ రావు అన్నారు.