హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: కిషన్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం హోంగార్డు వ్యవస్థను అవమానిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 7 Sep 2023 10:11 AM GMTహోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: కిషన్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం హోంగార్డు వ్యవస్థను అవమానిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 17 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడీ జరుగుతోందని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో హోంగార్డు రవీందర్‌ను తెలంగాణ బీజేపీ అద్యక్షుడు కిషన్‌రెడ్డి పరామర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హోంగార్డు హక్కులు, సమస్యల కోసం ప్రభుత్వాన్ని నిలదీశానని చెప్పారు. హోంగార్డు సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేశానని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు కాలేదని కిషన్‌రెడ్డి అన్నారు. హోంగార్డు వ్యవస్థను క్రమబద్దీకరిస్తామని కేసీఆర్ చెప్పారని.. కానీ ఇంతవరకూ అమలు చేయలేదని కిషన్‌రెడ్డి అన్నారు. 8 గంటల డ్యూటీ చేయాల్సినదైతే.. అంతకంటే ఎక్కువే పనిచేయిస్తున్నారని అన్నారు. శ్రమ దోపిడీ జరుగుతోందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
అంతేకాదు.. హెల్త్ పరంగా, అలెవెన్సు, డబుల్‌బెడ్రూం ఇళ్లను హోంగార్డులకు ఇవ్వాలని కిషన్‌రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల ద్వారా హోంగార్డులకు న్యాయం జరగలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ హామీలిచ్చి ఐదేళ్లు కావొస్తున్న సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. హోంగార్డులకు సకాలంలో జీతాలు అందక రోడ్డున పడుతున్నారని అన్నారు. వారికి సకాలంలో జీతాలు అందించాలని కోరారు. ఇక హోంగార్డు రవీందర్ ప్రాణాలు కాపాడటం కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని.. అతడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. రవీందర్ ఆరోగ్యంగా తిరిగి రావాలని తాను కోరుకుంటున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. హోంగార్డులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. సమస్యల పరిష్కారానికి పోరాడదామని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రానుందని.. హోంగార్డులకు అండగా ఉంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.