హైదరాబాద్: ఎండలు దంచికొడుతున్న వేళ.. మందుబాబులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మద్యం ధరలపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలు పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ఆదివారం సర్క్యూలర్ పంపింది. ప్రభుత్వం మద్యంపై స్పెషల్ ఎక్సైజ్ సెస్ (SEC) విధించింది. దీని వలన వివిధ బ్రాండ్లలో ధరలు 180 ml పై కనీసం రూ. 10, 375 ml పై రూ. 20, 750 ml పై రూ. 40 పెరిగాయి. ఈ మేరకు జారీ చేసిన సర్క్యూలర్లలో ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ఈ పెంచిన మద్యం ధరలతో ఏడాదికి రూ. 2 వేల కోట్లు ప్రభుత్వానికి వచ్చే విధంగా నివేదిక రూపొందించింది.
త్వరలోనే మద్యం సరఫరా కోసం ప్రభుత్వం లిక్కర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం ముగియనుంది. జులై 1వ తేదీ నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం మద్యం ధరలను పెంచినట్టు తెలుస్తోంది. అయితే ఇంకోసారి మద్యం ధరలు పెరగకుండా ఉంచేందుకు కర్ణాటక తరహాలో మద్యాన్ని టెట్రా ప్యాకెట్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా ప్రతి క్వార్టర్ మీద కనీసం రూ. 15 నుంచి రూ. 20 వరకు తగ్గే అవకాశముందని సమాచారం. బ్రూవరీల యాజమాన్యాల డిమాండ్ల మేరకు ప్రభుత్వం నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఫిబ్రవరిలో బీర్ల ధర 15 శాతం పెంచిన తర్వాత ఇది జరిగింది.