జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు చేపట్టింది.
By Knakam Karthik
జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు చేపట్టింది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి భూ భారతి చట్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గత పది సంవత్సరాలలో రాష్ట్రంలో పేరుకుపోయిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో గత నెల 14వ తేదీన భూభారతి చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని , అదేనెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు.
ఈనెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయా మండలాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 2వ తేదీ నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులలో వచ్చే దరఖాస్తులకు నిర్ధేశిత గడువు పెట్టుకొని భూ భారతి చట్టం పరిధిలోకి వచ్చే ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
ప్రయోగాత్మకంగా నిర్వహించిన నాలుగు మండలాల్లో ఇప్పటికే కొన్నింటిని పరిష్కరించడం జరిగిందని, ఈనెల 30 తేదీ నాటికి దాదాపు 60 శాతం భూ సమస్యలను పరిష్కరిస్తామని భూభారతి చట్టానికి లోబడి పరిష్కరించవలసిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతూ,పరిష్కరించలేనివాటికి ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారులకు తెలియజేస్తామని తెలిపారు. ఎప్పటికీ పరిష్కారం కానివి ఉంటే అసలు పరిష్కార యోగ్యం లేనివి అక్రమమైనవి ఉంటే అవి పరిష్కారం కావు అని చెప్పడం జరుగుతుంది. భూ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలి అనేది భూ భారతి చట్టం లక్ష్యం. క్షేత్ర స్థాయిలో అధికారులు సత్వరం స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామని.. మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.