రేపటి నుంచి మరో 28 మండలాల్లో భూ భారతి అమలు

భూభార‌తి చ‌ట్టాన్ని ద‌శ‌ల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు.

By Knakam Karthik
Published on : 4 May 2025 7:37 PM IST

Telangana, Congress Government, Minister Ponguleti Srinivasreddy, Bhu Bharati

రేపటి నుంచి మరో 28 మండలాల్లో భూ భారతి అమలు

తెలంగాణ భూ ప‌రిపాల‌న‌లో నూతన అధ్యాయానికి నాంది ప‌లికిన భూభార‌తి చ‌ట్టాన్ని ద‌శ‌ల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు రెవెన్యూ , హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. గ‌త నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో నిర్వ‌హించిన మాదిరిగానే ఈనెల 5వ తేదీ నుంచి (రేప‌టి నుంచి) 20వ తేదీవ‌ర‌కు రాష్ట్రంలోని జిల్లాకొక మండ‌లం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సుల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటన లో వెల్ల‌డించారు.

ప్ర‌జాకోణంలో తీసుకువ‌చ్చిన ఈ భూభార‌తి చ‌ట్టంపై ప్ర‌జ‌ల్లో విస్తృత స్ధాయిలో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు. ఆయా మండ‌లాల్లో భూ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌ల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరించి వాటిని ప‌రిష్క‌రించ‌డ‌మే ఈ రెవెన్యూ స‌ద‌స్సుల ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు. ప్ర‌తి క‌లెక్ట‌ర్ రెవెన్యూ స‌ద‌స్సుల‌కు హాజ‌రై అక్క‌డ రైతులు, ప్ర‌జ‌లు లేవ‌నెత్తే సందేహాల‌కు వారికి అర్ధ‌మ‌య్యే భాష‌లో వివ‌రించి ప‌రిష్కారం చూపాల‌ని చెప్పారు. రైతుల భూ స‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కార‌మే ధ్యేయంగా ఎంతో అధ్య‌య‌నంతో తీసుకొచ్చిన భూ భార‌తి చ‌ట్టాన్ని క్షేత్ర స్థాయికి స‌మర్థంగా తీసుకెళ్లాల‌ని కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశం, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఒక కుట్రపూరితంగా, దురుద్ధేశ్యంతో తీసుకొచ్చిన ధరణితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ధరణితో ప్రజల జీవితాలను ఆగమాగం చేసింది. ఎన్నో రైతు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. గత ప్రభుత్వ పెద్దలే ధరణి దందాలకు అండదండలుగా నిలిచారు. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా గ‌త పదేండ్ల‌లో రాష్ట్రంలో భూ హ‌క్కుల విధ్వంసం జ‌రిగింది. రైతుల‌కు రెవెన్యూ సేవ‌లు దుర్భ‌రంగా మారాయి. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌ల‌హాలు, సూచ‌న‌లు, ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రైతు కళ్ల‌ల్లో ఆనందం చూడాల‌నే సంక‌ల్పంతో భూ భార‌తి చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చాం. చ‌ట్టాన్ని తీసుకురావ‌డం ఒక ఎత్తు కాగా దానిని అమ‌లు చేయ‌డం మ‌రో ఎత్తు. ప్ర‌జ‌లు , ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు అంద‌రి స‌హ‌కారంతో విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వంలో భూ స‌మ‌స్య‌పై కోర్టుకెళ్ల‌డం త‌ప్ప మ‌రో మార్గం ఉండేదికాదు. ఇందిర‌మ్మ ప్ర‌భుత్వంలో అధికార యంత్రాంగం రైతుల దగ్గ‌ర‌కు వ‌చ్చి వారి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తుంద‌న్నారు.

Next Story