నేటి నుంచి 'భూ భారతి' రెవెన్యూ సదస్సులు
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై నేటి నుంచి రెవెన్యూ సదస్సు జరగనున్నాయి.
By Knakam Karthik
నేటి నుంచి 'భూ భారతి' రెవెన్యూ సదస్సులు
తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై నేటి నుంచి రెవెన్యూ సదస్సు జరగనున్నాయి. పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. అక్కడ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు దరఖాస్తులు స్వీకరించి, వాటిని పోర్టల్ ద్వారా పరిష్కరిస్తారు. అయితే అందులోనూ పరిష్కారం కాకున్నా, పోర్టల్ పని చేయకపోయినా రాష్ట్రస్థాయిలో వాటి పరిష్కరానికి చర్యలు తీసుకుంటారు. ఈ సదస్సులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రారంభించనున్నారు.
ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో భూభారతి చట్టాన్ని అమలు చేస్తూ ఆయా మండలాల్లో వచ్చిన సూచనలు, సమస్యలను పరిశీలించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అమల్లోకి తీసుకురానున్నారు. భూభారతితో తెలంగాణను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
కొత్త భూ భారతి చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకువస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ చట్టంపై సమగ్ర అవగాహనను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు మండల స్థాయిల్లో సదస్సులు నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు నోడల్ అధికారులుగా, మండల తహసీల్ధార్లు సదస్సు నిర్వహణ బాధ్యులుగా వ్యవహరిస్తారు.