'రోజువారీ ఖర్చులకూ నిధులు లేవు'.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసిన భట్టి

అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు.

By అంజి  Published on  20 Dec 2023 6:56 AM GMT
Bhatti Vikramarka, Congress, Telangana, Assembly

'రోజువారీ ఖర్చులకూ నిధులు లేవు'.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసిన భట్టి

హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎన్నో ఆశలు, కలలు, ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అయితే కన్న కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేని పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, కలలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా దశాబ్ద కాలంగా సాగిన ఆర్థిక అరాచకాలు, తప్పిదాలను రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు, ఆశ‌లు, క‌ల‌ల‌ను నెర‌వేర్చేందుకు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల‌ను శాసనసభ నుంచి ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. మార్పు కోరుతూ ప్రజలు ఇచ్చిన తీర్పుకు సహేతుకమైన పాలన అందించాలనే లక్ష్యంతో ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ఈ శ్వేతపత్రంపై సభలో ఉన్న ప్రతి సభ్యుడు సూచనలు చేయాలని కోరుతున్నానని చెప్పారు. కాగా అంతకు ముందు ఏఐఎంఎం పార్టీ ఫ్లోర్ లీడర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ఎన్నికయ్యారు. సీపీఐ ఫ్లోర్ లీడర్‌గా కూనంనేని సాంబశివరావులు ఎంపిక అయినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.



Next Story