కొనుగోలు కేంద్రాలు కొనసాగించకపోతే.. యుద్ధమే : భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Fires On TS Govt. పంట కొనుగోలు కేంద్రాలను యధావిధిగా కొనసాగించాలని.. లేకపోతే రైతుల పక్షాన యుద్ధం తప్పదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

By Medi Samrat  Published on  14 Feb 2021 3:36 PM IST
Bhatti Vikramarka Fires On TS Govt

పంట కొనుగోలు కేంద్రాలను యధావిధిగా కొనసాగించాలని.. లేకపోతే రైతుల పక్షాన యుద్ధం తప్పదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులతో ముఖాముఖి - పొలంబాట పోరుబాట కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం నాగాపురం గ్రామంలో రైతులతో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. వచ్చే సంవత్సరం నుంచి మద్దతు ధర ఉండదు, కొనుగోలు కేంద్రాలు ఉండవు అన్న కేసీఆర్ పై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందని భట్టి చెప్పారు. రైతుల పక్షాన కిసాన్ కాంగ్రెస్ ఈ నెల 27న చలో హైదరాబాద్ కార్యక్రమం చేస్తోందని.. అందులో ప్రతి రైతు తప్పనిసరిగా పాల్గొనలని ఆయన పిలుపు ఇచ్చారు.

పంటలు బాగా పండి, మద్దతు ధరతో లాభాలు వచ్చి రైతు, రైతు కుటుంబం క్షేమంగా ఉంటేనే గ్రామాలు.. వాటితో వాటు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రాష్ట్రం ఏమైనా ఫరవాలేదు.. నేను, నా కొడుకు, నా కూతురు, నా కుటుంబం బాగుంటే చాలనుకుని పాలన చేస్తున్నట్లు ఉందని అన్నారు. కేసీఆర్ ఒక నియంతలా పాలన చేస్తున్నాడు కాబట్టే మిగులు బడ్జెట్ తో రాష్ట్రం తెచ్చుకున్నా.. మన రైతన్నల కళ్లలో కన్నీళ్లు కారుతున్నాయని చెప్పారు. కన్నీరు పెడుతున్న రైతన్నను కాపాడాల్సిన బాధ్యత, ఓదార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని భట్టి చెప్పారు.

రైతులకు ఏమైంది అని అంటున్న ముఖ్యమంత్రి ఒక్కసారి పోలీసు భద్రత దాటుకుని, గ్రామాల్లోకి వచ్చి చూస్తే రైతుల బాధలు తెలుస్తాయని అన్నారు. కొనుగోలు కేంద్రాలు కొనసాగించేలా, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలు ఇక్కడ అమలు చేయమని ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని, లేకపోతే.. దీక్షలు, ధర్నాలతో ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు.

రైతులు కన్నీళ్లు పెడుతున్నా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటి బయటకు రావడం లేదని అన్నారు. రైతుల సమస్యలపై చట్ట సభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. రైతుల గళాన్ని వినిపిస్తామని భట్టి చెప్పారు. రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైందన్నారు. పంటను ఇష్టమొచ్చిన చోట పంట అమ్ముకోమనడం అగమ్యగోచరంగా మారిందన్నారు. తెలంగాణ వచ్చాక రైతు రోడ్డెక్కే పరిస్థితి ఉండదని రైతులు భావించారు.. కానీ రాష్ట్రం వచ్చాక కూడ పరిస్తితుల్లో మార్పు లేదని అన్నారు. పసుపు పంట సాగు రైతులకు సెంటిమెంట్.. నష్టమోస్తున్నా సాగు చేస్తున్నారని.. వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

పసుపు బోర్డు తెస్తాను.. లేదంటే రాజీనామా చేస్తానని హామీ ఇస్తేనే ఇక్కడ ప్రజలు అరవింద్ ను ఎంపీగా గెలిపించారని.. కానీ రెండేళ్లయిన బోర్డు లేదు.. మద్దతు ధర ఊసు లేదని అన్నారు. స్వరాష్ట్రం వస్తే బాగు పడతామని రైతులు భావిస్తే.. కేసులు తప్ప ఇంకేమీ మిగల్లేదని భట్టి చెప్పారు. పసుపు సాగు చేసిన రైతులకు.. కనీసం కూలీ ఖర్చులు కూడా మిగలడం లేదని రైతులు చెప్పారు. ఇంటిల్లిపాదీ పొలంలో పని చేసి మార్కెట్ కు పంట తీసుకెళ్తే ధర లేక దిగులు చెందుతున్నారన్నారు. న్యాయమైన హక్కుల కోసం రైతులు పోరాడితే.. అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని చెప్పారు. నీళ్లు, నిధులు, రైతుల కోసమే రాష్ట్రం తెచ్చుకున్న రాష్ట్రంలో.. ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ పేరుతో చుక్క నీరు తేకున్నా నిధులు మాత్రం దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story