సునీల్ నాయక్ లాంటి మరణాలు ఇక జరగకూడదు
Bhatti Vikramarka Fires On CM KCR. రాష్ట్రంలో సునీల్ నాయక్ లాంటి మరణాలు జరగడానికి ఇక ఏ మాత్రం వీలులేదని
By Medi Samrat Published on 3 April 2021 7:45 PM ISTరాష్ట్రంలో సునీల్ నాయక్ లాంటి మరణాలు జరగడానికి ఇక ఏ మాత్రం వీలులేదని, తక్షణం ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు చేపట్టాలని, క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులు భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. అదే విధంగా గరిష్ట వయోపరిమితిని కూడా పెంచి భర్తీ పక్రియను వెంటనే చేపట్టాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సునీల్ నాయక్ మృతి అత్యంత బాధాకరం, విషాదకరమని, ఈ ఘటన తనను తీవ్ర కలతకు గురిచేసిందని భట్టి అన్నారు.
నిరుద్యోగ యువత కూడా ఎవరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, పోరాడి అన్నిటినీ సాధించుకుందాం అని భట్టి విజ్ఞప్తి చేశారు. కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టంలో ఆత్మబలిదానాలు అత్యంత విచారకరమని, ఈ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆ స్థానంలో వున్నారంటే కారణం వందలాదిమంది ప్రాణాత్యాగాల ఫలితమన్నారు. అలాంటిది ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తరువాత కూడా గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణాలో ఉద్యోగాల భర్తీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూపులు చూస్తున్నారని, ఉద్యోగ నియామకాలు యువత ఆశించినంతగా, ముఖ్యమంత్రి చెప్పినట్లుగా జరగడం లేదన్నారు. ఇటీవల పే రివిజన్ కమిషన్ కూడా రాష్ర్టంలో ఒక లక్ష్యా 91 ఉద్యోగాల ఖాళీలు వున్నాయని తన నివేదికలో పేర్కొందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎప్పటికప్పుడు కేసీఆర్ చేబుతున్న మాటలు కార్యరూపం దాల్చడం లేదని, తాజాగా జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇదే విషయమై ప్రశ్నించగా త్వరలోనే భర్తీ చేస్తామన్నారన్నారు.
అదే విధంగా చాలా కాలం నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు లేనందున సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువత వేచిచూస్తున్నారని, ప్రభుత్వం నిర్లక్యం, అలసత్వం వల్ల ఉద్యోగాల భర్తీ లేనప్పుడు అందుకు నిరుద్యోగులను శిక్షించడం సరియైంది కాదన్నారు. దరఖాస్తు సమయంలో గరిష్ట వయోపరిమితి పెంచాల్సిన అవసరం వుందన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా వయోపరిమితి పెంపు పై హామీ నిచ్చారని, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుండి 61 సంవత్సరాలకు పెంచుతామని, దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగాల నియామక వయోపరిమితిని మూడేళ్ళు పెంచడం జరగుతుందని ఇచ్చిన హామీని, పేర్కొన్న విషయాన్ని భట్టి గుర్తు చేశారు. 2011 తరువాత ఇంతవరకు గ్రూప్-1, గ్రూప్-2, సహా ఎలాంటి ఉద్యోగాల భర్తీకైనా ఇతర గెజిటెడ్ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ కాలయాలన, నిర్లక్ష్యానికి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టడం సరియైంది కాదన్నారు.
గరిష్ట వయోపరిమితిని పెంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తక్షణం చేపట్టాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేపట్టే ఉద్యోగ, ఉపాధ్యాయ సహా అన్ని రకాల ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ళ నుండి 44 ఏళ్లకు పెంచాలని, ఎక్కువ మంది నిరుద్యోగలకు అవకాశం కల్పించేందుకు, అర్హత సాధించేందుకు ఇది చాలా అవసరమని భట్టి విక్రమార్క ప్రకటనలో పేర్కొన్నారు.