ఆ యాత్రకు భయపడి ఇబ్బందులకు గురి చేస్తుంది.. వెనక్కి తగ్గేది లేదు
Bhatti Vikramarka Fire On Center. బీజేపీ తప్పుడు విధానాలకు నిరసనగా ఈ నిరసనలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని
By Medi Samrat Published on 21 July 2022 4:20 PM IST
బీజేపీ తప్పుడు విధానాలకు నిరసనగా ఈ నిరసనలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సోనియా, రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టి ఈడీ విచారణకు పిలిచి వేధింపులు చేస్తున్నారని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కాంగ్రెస్ కు సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. సంబంధం లేని విషయంలో కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని.. ఈడీ, సీబీఐ, న్యాయ స్థానాలపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీలు ఉండకుండా చేయాలని చూస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు.
బీజేపీ అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఉద్యోగాలు లేవు.. ధరలు పెరుగుతున్నాయి.. ప్రజల ఆస్తులను, సంస్థలను వారి స్నేహితుడికి ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. పోరాటం చేసి జాతిని ఐక్యం చేయాలని కాంగ్రెస్ ప్రాణాళికలను రూపొందించిందని తెలిపారు. భారత్ జోడోయాత్ర ద్వారా ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని పాదయాత్ర చేపట్టాలని రాహుల్ గాంధీ నిర్ణయించారని అన్నారు. ఆ యాత్రకు భయపడి బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు.
నాయకత్వాన్ని భయపెట్టి మానసిక ఒత్తిడికి గురి చేయాలని చూస్తుందని ఆరోపించారు. పార్లమెంట్ నడిచే సందర్భంలో ఎంపీలను అటెండ్ కాకుండా ఈడీ విచారణకు పిలవడం గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. ఈ రోజు సోనియాగాంధీ ని పిలిచారు.. ప్రతిపక్ష నేతలందరిని పిలిచి చర్చ లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. ఈడీ ఆఫీస్ కి పిలిచినంత మాత్రాన కాంగ్రెస్ నాయకత్వం భయపడదని.. భారత్ జోడోయాత్రపై వెనక్కి తగ్గేదిలేదని అన్నారు.