అధికారంలోకి రాగానే తెలంగాణలో కులగణన చేస్తాం : భట్టి
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన అభయహస్తం మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు
By Medi Samrat Published on 17 Nov 2023 3:00 PM GMTతెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన అభయహస్తం మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయడం సంతోషంగా ఉందని CLP నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అభయాస్తం మేనిఫెస్టో విడుదల కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభయహస్తం మేనిఫెస్టో పీపుల్స్ మేనిఫెస్టో.. ఇది ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురావడానికి దోహదపడుతుందన్నారు.
తెలంగాణ ధనిక రాష్ట్రం, సంపద ఉన్న రాష్ట్రం ప్రజల జీవితాలను మార్చడానికి తెలంగాణ కావాలని కోరి కొట్లాడితే పెద్దలు తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ వచ్చింది కానీ ప్రజలకు మాత్రం సంపద అందలేదన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే ఆకాంక్షలను కాంగ్రెస్ పూర్తిగా సాకారం చేస్తుందన్నారు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం బీసీ సబ్ ప్లాన్ తీసుకువస్తామన్నారు.
రాహుల్ గాంధీ చెబుతున్నట్టుగా దేశంలో కుల గణన జరగాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి రాగానే తెలంగాణలో కులగణన చేస్తామన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేయడంతో పాటు కౌలు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా గుంజుకున్నది. ఈ భూములను తిరిగి ప్రజలకు పంపిణీ చేస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు. ప్రజల సంపద ఎలా ప్రజలకు పంచాలో కాంగ్రెస్ మానిఫెస్టోలో పొందుపరిచామన్నారు.
దొరల తెలంగాణకి ప్రజల తెలంగాణకి మధ్య పోరు అని రాహుల్ గాంధీ చెప్పారు. ఇది ప్రజల మేనిఫెస్టో.. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రాబోతుందన్నారు. అభయహస్తం కాంగ్రెస్ మేనిఫెస్టోను పార్టీ శ్రేణులు ఇంటింటికి తీసుకువెళ్లి ప్రజలకు వివరించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేయాలని సూచించారు. ప్రజల సంపద ప్రజలకు పంచేదానిలో కాంగ్రెస్ శ్రేణులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.