రాజ్యాంగాన్ని మార్చాలని భావిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ పాలకుల కుట్రను తిప్పికొట్టాలి
Batti Vikramarka Fire On TRS BJP. రాజ్యాంగం దేశ ప్రజలకు గొప్ప వరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
By Medi Samrat Published on 26 Nov 2022 11:07 AM GMTరాజ్యాంగం దేశ ప్రజలకు గొప్ప వరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు నవంబర్ 26. దీనిని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. అణగారిన వర్గాల ప్రజల దేవుడు అంబేద్కర్. దేశంలో అందరికీ సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల్లో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం అందించిన మహా గ్రంధం భారత రాజ్యాంగం అని వివరించారు.
ఈ దేశంలో ప్రతి పౌరుడు తలెత్తుకొని గౌరవంగా జీవిస్తున్నారంటే.. ఈ దేశానికి కాంగ్రెస్ ద్వారా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం పుణ్యమేనని అన్నారు. ప్రపంచ దేశాలు సైతం భారత రాజ్యాంగం.. మా దేశంలో ఉంటే బావుండు అని కోరుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత రాజ్యాంగం వైపు చూస్తున్నాయి. ఇది అంబేద్కర్ ఘనతేనని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో ఏలాంటి అలజడి లేకుండా అధికార బదిలీ అవుతుంది అంటే రాజ్యాంగం వల్లేనని గుర్తుచేశారు. దేశానికి గొప్ప రాజ్యాంగం అందించిన అంబేద్కర్ కి దేశ ప్రజలు రుణపడి ఉండాలని అన్నారు. రాజకీయ ఆర్థిక సామాజిక హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని అందించడంతో పాటు దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నిబద్ధత కలిగి ఉండాలని కోరారు.
భారత రాజ్యాంగం స్ఫూర్తితో పాలకుల ఆలోచన ఉండాలి. భిన్నమైన ఆలోచనలు అనేక ప్రమాదాలకు ఉత్పన్నమవుతాయని అన్నారు. బిజెపి, టిఆర్ఎస్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో మోదీ పాలన రాజ్యాంగ విరుద్ధంగా సాగుతుందని అన్నారు. భావప్రకటన స్వేచ్ఛను మోదీ సర్కార్ హరిస్తుందని అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో ప్రశ్నించే గొంతులను, ప్రతిపక్ష నాయకులను అణచివేస్తుందని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి మనువాదా శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తుందని విమర్శించారు.
రాజ్యాంగాన్ని మార్చాలని భావిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ పాలకుల కుట్రను, ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ సామాజికంగా అందరికి సమాన హక్కులు ఇచ్చిందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ రాష్ట్రంలో ఆర్థిక సమానత్వం కల్పించడానికి భూసంస్కరణలు, 20 సూత్రాల అమలు, బ్యాంకుల జాతీయకరణ చేశారని తెలిపారు. రాజకీయ సమానత్వం కాంగ్రెస్ పరిపాలనలో మాత్రమే అమలైందని వెల్లడించారు.
బీజేపీ దేశంలో ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. దేశ ప్రజలకు ఆర్థిక సమానత్వం లేకుండా.. ప్రధాని మోదీ దేశంలో ఒకరిద్దరూ కార్పోరేట్ స్నేహితులకు ఈ దేశ సంపదను కట్టబెడుతున్నారని ఆరోపించారు. 8 సంవత్సరాల బీజేపీ పాలనలో మాములు వ్యాపారవేత్త ఆదానీ ప్రపంచంలోనే 2వ కుబేరుడుగా ఎదిగాడంటే.. దేశ సంపదను మోదీ ఆదానీకి ధారాదత్తం చేయడమే కారణమని ఆరోపించారు.
ఇప్పుడు బడుగు బలహీన, బహుజన అవకాశాలు కొల్లగొట్టి కొంతమందికి మాత్రమే రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా మను ధర్మ శాస్త్రాన్ని బిజెపి ముందుకు తీసుకొస్తున్నదని అన్నారు. రాజకీయ సమానత్వం లో అత్యంత పేదవాడు సైతం ఎన్నికల్లో గెలిచేలా ఉండాలని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టిన సొమ్ముతో బీజేపీ వేల కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేస్తూ సామాన్యులకు రాజకీయ అవకాశాలు లేకుండా చేస్తున్నదని విమర్శించారు. దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కేసులు.. వాళ్లు చెప్పితే మాట్లాడాలి.. ప్రచారం చేయాలి.. లేకుంటే ఈడీ, సీబీఐ, ఎసిబి లతో దాడులు చేస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు.
భారత రాజ్యాంగాన్ని మార్చి మనువాద శాస్త్రాన్ని తిరిగి నిర్మాణం చేయాలని బీజేపీ చేస్తున్న కుట్రల వల్ల దేశంలో కోట్లాదిమంది జీవన ప్రమాణ పరిస్థితులు తారు మారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీజేపీ చేస్తున్న అరాచకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళడం దేశానికి స్వాతంత్ర్చం తీసుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మన భాధ్యత అని గుర్తుచేశారు. రాజ్యాంగం మూల సిద్ధాంతమే.. కాంగ్రెస్ మూల సిద్ధాంతం.. ఈ సిద్ధాంతాలను కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.