ధర్మయుద్దం మొదలైంది.. టీఆర్ఎస్‌ను తరిమి తరిమి కొట్టండి: బండి సంజయ్
Bandi Sanjay sensational comments on Munugodu by-elections. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
By అంజి Published on 8 Aug 2022 8:33 PM ISTమునుగోడులో బీజేపీ గెలుపుతో నాలుగో 'ఆర్' రాబోతున్నడు
యువకులారా... ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ అరాచక పాలనను వివరించండి
ఎప్పుడు ఎన్నికలొచ్చినా గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయం
చౌటుప్పల్ ప్రజా సంగ్రామ యాత్ర సభలో బండి సంజయ్ కుమార్ ప్రసంగం
మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ''మునుగోడులో ఇవాళ్టి నుండే ధర్మయుద్దం మొదలైంది. హుజూరాబాద్ సమయంలో నేను ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూపిస్తానని చెప్పా. అన్న మాట మేరకు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూపించా.. ఇప్పుడు చెబుతున్నా.. మునుగోడులో గెలిచేది కాషాయ జెండానే... నాలుగో 'ఆర్' కూడా రాబోతున్నాడు'' అని బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మునుగోడుతోపాటు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలిచేది బీజేపీ మాత్రమేనన్నారు. గొల్కోం కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడం ఖాయమని.. మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనూ నిజాయితీ పాలనను అందిస్తామని పేర్కొన్నారు.
8 ఏళ్ల కేసీఆర్ పాలనలో మోసపోయిన అన్ని వర్గాల ప్రజలు, యావత్ యువత టీఆర్ఎస్‌ను తరిమి తరిమి కొట్టాలని మునుగోడు ప్రజలను అభ్యర్థిస్తున్నారని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రంలో భాగంగా 6వ రోజు మసీదు గూడ నుండి పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్ శెరిల్ల, పెద్ద కొండూరు, చిన్నకొండూరు మీదుగా చౌటుప్పల్, తాళ్ల సింగారం క్రాస్ రోడ్డు వరకు మొత్తం 13.8 కి.మీలు నడిచారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ పట్టణంలోకి పాదయాత్ర ప్రవేశించగానే వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు బండి సంజయ్‌కు ఎదురేగి స్వాగతం పలికారు.
బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్‌ను తమ భుజాలపైకి ఎత్తుకుని సభా వేదిక వరకు నడుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరోమైపు భారీ ఎత్తున హాజరైన సందోహానికి అభివాదం చేస్తూ... వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వచ్చిన బండి సంజయ్ ఈ సందర్భంగా చౌటుప్పల్ పట్టణానికి వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
బండి సంజయ్ మాట్లాడుతూ.. ''యుద్దం ఇవాళే మొదలైంది. మీరంతా సిద్ధమే కదా.. రబ్చర్ చెప్పులు, జీన్స్ పాయింట్, టీ షర్ట్ లు రెడీగా ఉన్నయ్ కదా.. దుబ్బాక ఎన్నికల్లో ఒకాయన రబ్బర్ చెప్పులు, జీన్స్ పాయింట్ గాళ్లు ఏం చేస్తారని అంటే ఏం చేశారో తెలుసు కదా.. ఇప్పడు కూడా అదే పని చేయాలి. మునుగోడులో ఏ సర్వేలు నిర్వహించినా బీజేపీ రెపరెపలాడుతుందని నివేదికలొస్తున్నాయి. మా మనోహర్ రెడ్డిని ఏమన్నా బాధపడుతున్నవా? అంటే... నేను బీజేపీ కార్యకర్తను.. ఇక్కడ కాషాయ జెండా గెలవడమే నాకు ముఖ్యమని చెప్పాడు. ఈ రోజు రాజగోపాల్ రెడ్డి కూడా మనోహర్ రెడ్డి విషయంలో బాధపడ్డారు. కానీ మూర్ఖత్వపు సీఎం పాలనను భరించలేక మునుగోడు ప్రజలకు న్యాయం చేయడానికి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధపడ్డాడు. రాజగోపాల్ రెడ్డిని మేం గెలిపించుకుంటమని మనోహర్ రెడ్డి చెప్పాడు.. దటీజ్ మనోహర్ రెడ్డి.'' అని అన్నారు.
''అసలు కేసీఆర్‌కు ఎందుకు ఓటేయాలి.. నక్కల గండి ప్రాజెక్టు దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని పనిచేస్తనన్నడు కదా... ఏమైంది? మీ చౌటుప్పల్ కు డిగ్రీ కాలేజీ ఉందా? సూపర్ స్పెషాలిటీ ఉందా? ఈసారి కేసీఆర్ ఇక్కడికి వస్తే... ఇక్కడే నిలబెట్టండి.. మూసీ నది నీళ్లతో స్నానం చేస్తే కేసీఆర్‌కే ఓటేద్దాం. మిషన్ భగీరథ నీళ్లొస్తున్నయా? 40 వేల కోట్లు వృథా.. నీతి అయోగ్ పోతే పల్లీలు పెడుతున్నారట.. కేసీఆర్‌కు పల్లీలతోపాటు మందు పోస్తే బాగుండేదేమో.. మోదీగారికి అలవాటు లేదాయే.'' అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
నిన్నగాక మొన్న గట్టుప్పల్ మండలాన్ని ప్రకటించారు. బీజేపీ వల్లే ఇది సాధ్యమైంది. గతంలో ఎన్టీఆర్ హయంలో దీనిని మండలంగా ప్రకటించారు. కేసీఆర్ వచ్చాక కూడా కొత్త మండలాల ఏర్పాటు చేసినా గట్టుప్పల్‌ను సైతం కొత్త మండలాన్ని ప్రకటించి మాట తప్పారు.. కానీ మునుగోడు ఎన్నికలు వస్తుండటంతో బీజేపీ సర్పంచ్ టీఆర్ఎస్‌లో చేరితే కొత్త మండలం చేస్తానని అతనిని టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. కేంద్ర నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయించింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎరువులు, డీఏపీ, ఇతర సబ్సిడీలతోపాటు కిసాన్ సమ్మాన్ నిధి కలుపుకుని ఒక్క ఎకరానికి రూ.40 వేల సబ్సిడీ ఇస్తున్నాడని బండి సంజయ్ చెప్పారు.
మునుగోడు నియోజకవర్గానికి కేంద్రమిచ్చిన నిధుల వివరాలు ఇవిగో..
చౌటుప్పల్ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన నిధులతో మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గణాంకాలతో సహా వివరించారు. ఆ వివరాలివే...
* ఉపాధి కూలీలకు చెల్లించిన కూలీ మొత్తం 166 కోట్ల 67 లక్షలు
* మౌలిక సదుపాయాల కల్పన కోసం, సామాగ్రి ఖర్చు కోసం 67 కోట్ల 48 లక్షలు
* మొక్కల పెంపకం కోసం ఖర్చు చేసిన నిధులు 26 కోట్ల 38 లక్షలు
* 14 వ ఆర్ధిక సంఘం నిధులు 54 కోట్ల 98 లక్షలు
* 15 వ ఆర్ధిక సంఘము నిధులు 20 కోట్ల 78 లక్షలు
* స్వచ్ఛభారత్ అభియాన్ ద్వారా 9 కోట్ల 91 లక్షల రూపాయలతో 13 వేల 763 కుటుంబాలకు మరుగుదొడ్లు కోసం నిధులు ఇచ్చాము.
* 324 ట్రాయ్ సైకిల్స్ కోసం 38 లక్షల 94 వేలు
* పీఎం కిసాన్ సమ్మన్ నిధి ద్వారా 102 కోట్ల 18 లక్షలు ఇచ్చాము. తద్వారా 51 వేయి 92 కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని బండి సంజయ్ చెప్పారు.