ఓట‌మి భ‌యంతోనే ఈ స్కెచ్‌.. క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం కేసీఆరే : బండి సంజ‌య్‌

Bandi Sanjay says KCR drama to tarnish BJP image.తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్ర‌లోభాల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2022 9:04 AM IST
ఓట‌మి భ‌యంతోనే ఈ స్కెచ్‌.. క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం కేసీఆరే : బండి సంజ‌య్‌

తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్ర‌లోభాల వ్య‌వ‌హారం తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆడుతున్న డ్రామా అని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆరోపించారు. ఏ స‌ర్వేలు చూసిన మునుగోడులో బీజేపీ గెలుస్తుంద‌ని చెబుతున్నాయ‌న్నారు. కొడుకు, అల్లుడు స‌హా అంతా అక్క‌డే తిష్ట‌వేసినా మునుగోడులో టీఆర్ఎస్‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలియ‌డంతోనే కేసీఆర్ ఇలాంటి నీచ‌మైన డ్రామాకు తెర‌దీశార‌న్నారు.

న‌ల్ల‌గొండ జిల్లా మ‌ర్రిగూడ తిర‌గండ్ల‌ప‌ల్లిలో బుధ‌వారం రాత్రి బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేల‌ నెత్తిపై రూపాయి పెడితే అర్థ రూపాయికి కూడా కొనేందుకు ఎవ‌రూ సిద్దంగా లేరని, వాళ్ల‌ను కొనాల్సిన ఖ‌ర్మ బీజేపీకి లేద‌ని చెప్పారు. ఇటీవ‌ల కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు స‌ద‌రు స్వామీజీల‌ను పిలిపించుకుని మాట్లాడ‌ర‌ని, అక్క‌డే స్క్రిప్టు రాసి అమ‌లు చేస్తున్నార‌న్నారు.

ముఖ్య‌మంత్రికి స‌వాల్ విసురుతున్నాం. మీరు యాద్రాద్రికి వ‌స్తారా..? టైం, తేదీ మీరే చెప్పండి. బీజేపీ త‌రుపున ఎవ‌రు కోరుకుంటే వాళ్లం వ‌స్తాం. ఈ డ్రామాతో సంబంధం లేద‌ని ప్ర‌మాణం చేసే ద‌మ్ము, ధైర్యం ఉందా..? అని ప్ర‌శ్నించారు. ఈ వ్య‌వ‌హారానికి పూర్తి స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచే న‌డిచింద‌ని, సీఎం క‌నుస‌న్న‌ల్లోనే ఇదంతా జ‌రిగింద‌న్నారు. దీనిపై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపితే వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తాయ‌న్నారు.

ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని డెక్క‌న్ కిచెన్ హోట‌ల్‌లో నాలుగు రోజుల‌ సీసీ కెమెరా పుటేజీలు బ‌య‌ట‌పెట్టాల‌ని సంజ‌య్ డిమాండ్ చేశారు. అలాగే ప్ర‌గ‌తి భ‌వ‌న్ సీసీ పుటేజీ బ‌య‌ట‌పెడితే ముఖ్య‌మంత్రి ఆడుతున్న డ్రామా అంతా బ‌య‌ట‌ప‌డుతుంద‌ని చెప్పారు. ఈ డ్రామాలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర ఉంద‌ని, గ‌తంలోనూ ఓ మంత్రి త‌న‌పై హ‌త్యాయ‌త్నం చేసిన‌ట్లు డ్రామా చేయించ‌డంలో ఈ పోలీస్ ఆఫీస‌రే అత్యుత్సాహం చూపార‌న్నారు.

నంద‌కుమార్ ఓ గుట్కా వ్యాపారి. ఆ ఫాంహౌస్ గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారిందన్నారు. ఎమ్మెల్యేలు, స్వామిజీల కాల్ లిస్ట్ బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. రూ.100 కోట్లు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో కూడా బ‌య‌ట‌పెట్టాల‌న్నారు. అహంకారం త‌లకెక్కి బీజేపీపై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడితే ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెబుతార‌న్నారు.

Next Story