తెలంగాణకు CRIF నిధులను మంజూరు చేయండి..గడ్కరీకి బండి రిక్వెస్ట్

తెలంగాణకు సీఆర్ఐఎఫ్ నిధులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన బండి సంజయ్ కోరారు.

By Knakam Karthik
Published on : 28 July 2025 4:30 PM IST

Telangana, Bandi Sanjay, Union Minister Gadkari , CRIF funds to Telangana

తెలంగాణకు CRIF నిధులను మంజూరు చేయండి..గడ్కరీకి బండి రిక్వెస్ట్

తెలంగాణలో పలు రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని వెంటనే సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) నిధులను విడుదల చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ..కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. సోమవారం ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిసిన బండి సంజయ్ ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న రోడ్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి అందజేశారు. మొత్తం రూ.113 కోట్లతో కూడిన సీఆర్ఐఎఫ్ ప్రతిపాదనలను గడ్కరీకి సమర్పించారు.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని బావుపేట–ఖాజీపూర్ రోడ్డులో భాగంగా మానేరు నదిపై హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి–పోతూర్ రోడ్డు విస్తరణ పనులు వీటిలో ఉన్నాయి. దీంతోపాటు చందుర్తి నుండి మోత్కురావుపేట వరకు (కిమీ 5/0 నుండి 8/450 వరకు) వంతెనల నిర్మాణ పనుల ప్రతిపాదనలు ఉన్నాయి. అట్లాగే కిస్టంపల్లి వరకు రోడ్డుపై వంతెన నిర్మాణ పనులు, శంకరపట్నం మండలంలోని అర్కాండ్ల (గ్రామం) నుండి కన్నాపూర్ (గ్రామం) వరకు వరద కాలువపై హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదనలు సైతం వీటిలో ఉన్నాయి. దీంతోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న రోడ్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి అందజేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ త్వరలోనే తెలంగాణకు సీఆర్ఐఎఫ్ నిధులు విడుదలపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్-జగిత్యాల విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. గత ఎన్నికలకు ముందే కరీంనగర్ నుండి జగిత్యాల వరకు 4 లేన్ విస్తరణ కోసం కేంద్రం రూ.2151 కోట్ల 35 లక్షల నిధులతో ప్రతిపాదనలు రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయా ప్రతిపాదనలకు ఆమోదం పొందడంతోపాటు టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చి నెలలు దాటుతున్నా నేటికీ టెండర్ ప్రక్రియ ప్రారంభం కాని విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పిలిపించిన గడ్కరీ అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, న్యాయపరమైన అడ్డంకుల నేపథ్యంలోనే కరీంనగర్- జగిత్యాల రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం ఆయా అడ్డంకులన్నీ అధిగమించి నివేదికను కమిటీకి పంపించామని తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే రోడ్డు పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి అతి త్వరలోనే విస్తరణ పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు.

Next Story