కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో లా కాలేజీ అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్‌ను కోరారు. శాతవాహన వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావులతో కలిసి బండి సంజయ్ మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు.
శాతవాహన వర్సిటీ పరిధిలో వచ్చే విద్యా సంవత్సరానికి గాను 120 మందితో (రెండు సెక్షన్లతో కలిపి) లా కాలేజీని నడిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి గతంలో విజ్ఝప్తి చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వర్చువల్ ద్వారా తనిఖీ నిర్వహించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వివరణలతో కూడిన నివేదిక కోరిందని పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు వివరణాత్మక నివేదికను పంపామని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మూడేళ్ల లా కోర్సుకు అనుమతి ఇవ్వాలని విజ్ఝప్తి చేశారు. బండి సంజయ్ వినతికి సానుకూలంగా స్పందించిన అర్జున్ మేఘ్వాల్ అందుకు అనుగుణంగా శాతవాహన వర్శిటీకి అనుబంధంగా సాధ్యమైనంత తొందరలో లా కాలేజీకి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా రాబోయే విద్యా సంవత్సరం(2025-26) నుండే లా కాలేజీ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు.