తెలంగాణ రాజకీయాల్లోకి 'ది కశ్మీర్ ఫైల్స్'
Bandi Sanjay Reacts On CM KCR Comments. తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 22 March 2022 9:59 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి యావత్ ప్రపంచం నీరాజనాలు అర్పిస్తోందని, కానీ కేసీఆర్ కు మాత్రం ఆ సినిమా నచ్చడంలేదని అన్నారు. కేసీఆర్ కు ఇలాంటి సినిమాలు నచ్చవని, 'దోపిడీ దొంగలు' వంటి సినిమాలు నచ్చుతాయని అన్నారు. 'కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎంకు డీఎన్ఏ టెస్టు చేయించాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. "కశ్మీర్ ఫైల్స్ సినిమాతో నీకేంటి ఇబ్బంది? ఎందుకంత అక్కసు? ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్ లో ఏంజరిగిందో తెలుసుకో. కశ్మీర్ పండిట్లపై జరిగిన అరాచకాలను ప్రజలకు చూపిస్తే, ఇదొక పనికిమాలిన సినిమా అంటూ పనికిమాలిన బుద్ధులు చూపిస్తావా?" అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. "కశ్మీర్ లో జరిగిన దారుణాలు నిజం కాదా? తెలంగాణలో కేసీఆర్ రజాకార్ల పాలన నడిపిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే త్వరలోనే రజాకార్ ఫైల్స్, అవినీతి ఫైల్స్, ఓల్డ్ సిటీ ఫైల్స్ తీసుకొస్తాం" అని స్పష్టం చేశారు.
కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటి? అంత అక్కసు ఎందుకు?
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 22, 2022
370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్ లో జరిగిందేంటో తెలుసుకో...
కాశ్మీర్ పండిట్లపై జరిగిన ఉచకోతపై వాస్తవ విషయాలను ప్రజలకు చూపిస్తే... దీనిని పనికిమాలిన సినిమా అంటూ పనికిమాలిన బుద్ధులు చూపిస్తవా? pic.twitter.com/ulZ90iPA2D
సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'కశ్మీర్ ఫైల్స్' ఏంటండి.. ఇదొక దిక్కుమాలిన వ్యవహారమన్నారు. ప్రగతిశీల ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ ఫైల్స్, ఎనకమిక్ ఫైల్స్, ఇరిగేషన్ ఫైల్స్ వంటి వాటిపై దృష్టి సారిస్తాయని, ఇలా కశ్మీర్ ఫైల్స్‌ను తెర పైకి తీసుకురావడమేంటని ప్రశ్నించారు. కశ్మీర్ ఫైల్స్ ఎవరికి కావాలని దానితోని వచ్చేదేంటని మండిపడ్డారు. ఇది కేవలం ఓట్ల రూపంలో సొమ్ము చేసుకునే వ్యవహారమని కశ్మీరీ పండిట్లే ఢిల్లీలో చెప్పారని అన్నారు. దేశాన్ని విభజించి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏమాత్రం సరికాదన్నారు.