బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు అంతా రెడీ

Bandi sanjay plans for praja sangrama yatra 3rd phase. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు రెడీ అయ్యారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం

By అంజి  Published on  31 July 2022 2:51 PM IST
బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు అంతా రెడీ

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు రెడీ అయ్యారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడం, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా బండి సంజయ్ యాత్ర సాగనుంది. ఇప్పటికే రెండు విడతల్లో ప్రజాసంగ్రామ యాత్రను సంజయ్ నిర్వహించారు. మూడో విడత యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి దర్శనం అనంతరం బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రను సంజయ్ ప్రారంభించనున్నారు. 328 కి.మీ పొడవున యాత్ర సాగనుంది. ఆగస్టు 2 నుంచి 26 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఆగస్టు 6న భారత్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో సంజయ్ యాత్రకు విరామం ఇస్తారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. ఇందుకోసమే గత సంవత్సరం బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండ గట్టడంతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను నిలదీసే లక్ష్యంతో యాత్ర సాగించారు. 2021 ఆగస్టు 28న ప్రారంభించిన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా భువనగిరి, వరంగల్ పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలో 12 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మూడో విడత యాత్రను బండి సంజయ్ నిర్వహించనున్నారు.

ఈ యాత్రలో భాగంగా బండి సంజయ్ 125 గ్రామాలలో పర్యటిస్తారు. యాత్ర కొనసాగే ప్రదేశాల్లో ఉండే చారిత్రక ప్రదేశాలు, ఆలయాల దర్శనాలతో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. బీజేపీని అధికారంలోకి తీసుకురావడం చారిత్రక అవసరమనే నినాదంతో ప్రజల్లో వెళ్లేందుకు నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. అసలు మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగియడంతో మూడో విడత యాత్రకు ఏర్పాట్లు చేశారు.

Next Story