బీజేపీలో ఏ గ్రూపులుండవ్..బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విద్యార్థి దశలోనే కాషాయ జెండాను రెపరెపలాడించి అధికారం కోసం పోరాడిన నాయకుడు రామచందర్ రావు అని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
By Knakam Karthik
బీజేపీలో ఏ గ్రూపులుండవ్..బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విద్యార్థి దశలోనే కాషాయ జెండాను రెపరెపలాడించి అధికారం కోసం పోరాడిన నాయకుడు రామచందర్ రావు అని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నిక అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రాంచందర్ రావు ఓ మిస్సైల్ లాంటి వ్యక్తి అని కొనియాడారు. మొదటి నుంచి పార్టీకి ఆయన నిస్వార్థంగా సేవ చేశారని గుర్తు చేశారు. విద్యార్థి నాయకుడిగా, పార్టీ లీగల్ అడ్వైజర్‌గా, ఎమ్మెల్సీగా ఆయన చేసిన సేవలు ఎవరూ మరువలేరని అన్నారు. పార్టీలో అధ్యక్ష పదవిని ఎవరైనా అశించవచ్చని.. కానీ, అధిష్టానం నిర్ణయాన్ని కూడా పాటించాల్సిందేనని అన్నారు. రాబోయే రోజుల్లో రాంచందర్‌రావు నాయకత్వంలో అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీని ట్రోల్ చేసినోళ్లు కాలగర్భంలో కలిసిపోయారని కామెంట్ చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్రాప్‌లో పడొద్దని అన్నారు.
అధ్యక్షుడు కావాలని ఎవరైనా ఆశించొచ్చు. హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్న తరువాత తూ.చ తప్పకుండా పాటించాల్సిందే. ప్రజాసంగ్రామ యాత్ర సమయంలో మాపై అనేకమంది బీఆర్ఎస్ గూండాలు దాడులు చేశారు. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంది కార్యకర్తలే. మా కార్యకర్తలపైన, మాపైన కేసులు పెట్టి జైళ్లకు పంపితే కోర్టులో వాదించి బయటకు తీసుకొచ్చింది రామచంద్రరావు. మన లక్ష్యం... మోదీ రాజ్యం, రామరాజ్యం రావాల్సిందే... గొల్లకొండపై కాషాయ జెండా ఎగరేయాల్సిందే. అందరికీ ఇచ్చాం అవకాశం...బీజేపీకి ఇద్దాం అవకాశం...అని సామాన్య ప్రజలంతా భావిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఔట్... బీజేపీకి అధికారం పక్కా. దేశానికి బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత బీజేపీకే ఉంది... ఆ దమ్ము కాంగ్రెస్ కు ఉందా? దళిత, ఆదివాసీ బిడ్డలను రాష్ట్రపతులుగా చేసిన ఘనత ఒక్క బీజేపీకే దక్కుతుంది. నన్ను, లక్ష్మణ్, దత్తాత్రేయ, చలపతిరావు బీసలమే... మమ్ముల్ని అధ్యక్షులుగా చేసింది బీజేపీయే. దళితుడిని సీఎం చేయకుంటే తల నరక్కుంటానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్... మాట మార్చి దళితులను మోసం చేయలేదా?. బీఆర్ఎస్ కు సవాల్ చేస్తున్నా.... మీరు అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ముందా?. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు మాకు సమాన ప్రత్యర్థులే. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలను గాలికొదిలేశారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనలో అందరం పోరాడదాం. కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో వంద సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకోవడం తథ్యం. బీజేపీలో ఏ గ్రూపులుండవ్... మనందరిదీ ఒకటే గ్రూప్. మన టీం కెప్టెన్ నరేంద్రమోదీ..మనమంతా ఆ టీం సభ్యులమే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రౌండ్ ను ప్రిపేర్ చేసింది రామచంద్రరావే. పార్టీ సభ్యత్వ నమోదులోనూ కష్టపడి పనిచేసిన నాయకుడు రామచంద్రరావు. రామచంద్రరావు నాయకత్వంలో ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేయాలి. కాంగ్రెస్, బీజేపీ ట్రాప్ లో ఫడొద్దని కార్యకర్తలను కోరుతున్నా. రాబోయే స్థానిక ఎన్నికల్లో, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరేద్దాం..అని బండి సంజయ్ పేర్కొన్నారు.