బండి సంజ‌య్‌కు బెయిల్ మంజూరు

Bandi Sanjay gets bail in SSC paper leak case. ఎస్‌ఎస్‌సి హిందీ పేపర్ లీక్ కేసులో గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు

By Medi Samrat  Published on  6 April 2023 11:15 PM IST
బండి సంజ‌య్‌కు బెయిల్ మంజూరు

ఎస్‌ఎస్‌సి హిందీ పేపర్ లీక్ కేసులో గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రూ.20,000 వ్యక్తిగత పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. కాసేపట్లో బండి స‌జ‌య్‌ లాయర్లకు బెయిల్ పత్రాలు అందుతాయి. రేపు కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 5న పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌ను అరెస్టు చేశారు. మార్చి 4న జరిగిన 10వ తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీలో అతని ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో.. వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసి హన్మకొండ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

అయితే బీజేపీ లీగల్ సెల్ బృందం.. ఏప్రిల్ 5న హన్మకొండలో సంజయ్ తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. 8 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి బండి సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

మాజీ ఎమ్మెల్సీ, న్యాయవాది ఎన్ రాంచంద్రరావు న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ మాట్లాడుతూ.. షరతులలో కూడిన బెయిల్ మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. బాధితులతో సంభాషించ‌డం లేదా ప్రభావితం చేయడం వంటివి చేయ‌కూడద‌ని కోర్టు ఆదేశించింది. సంజయ్ దర్యాప్తుకు సహకరించాల్సిన ఉన్న నేప‌థ్యంలో దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.

బండి సంజయ్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేస్తూ హనుమ‌కొండ‌ కోర్టు ఇచ్చిన‌ తీర్పును బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ స్వాగతించారు. ‘‘సీఎం కేసీఆర్ పన్నిన రాజకీయ యుద్ధంలో ఎట్టకేలకు నిజం గెలిచిందని అన్నారు. బండి సంజ‌య్‌ను ఏప్రిల్ 8న ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ కార్యక్రమాలలో పాల్గొనకుండా నిరోధించడానికి ప్ర‌య‌త్నించిన సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీకి ఈ తీర్పు చెంప పెట్టులాంటిద‌ని వ్యాఖ్యానించారు.

ఏ రోజు ఏం జ‌రిగింది..

ఏప్రిల్ 4, 2023 - వరంగల్‌లో హిందీ పేపర్ లీక్

ఏప్రిల్ 4, 2023 - ఒక మైనర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు అరెస్టయ్యారు

ఏప్రిల్ 5, 2023 - బండి సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు

ఏప్రిల్ 5, 2023 - బండి సంజయ్ అరెస్ట్

ఏప్రిల్ 6, 2023 - బెయిల్ మంజూరు చేయబడింది


Next Story