ప్లీన‌రీలో ఈ 21 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలి : బండి సంజ‌య్‌

Bandi Sanjay Demands 21 questions to answers in TRS Plenary meeting.టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తెలంగాణ బీజేపీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2022 11:34 AM IST
ప్లీన‌రీలో ఈ 21 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలి : బండి సంజ‌య్‌

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీకి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. టీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్ త‌న 8 ఏళ్ల పాల‌న‌లో ఏం చేశారో చెప్పాల‌న్నారు. బాధ్య‌త గ‌ల ప్ర‌తిప‌క్ష పార్టీగా ప్ర‌జ‌ల త‌రుపున తాము అడిగే 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కెసిఆర్ గారు.. మీకు నిజం చెప్పకూడదు అన్న శాపం ఏమైనా ఉందా ? కనీసం మీ పార్టీ ఘనంగా జరుపుకుంటున్న 21వ ప్లీనరీ సందర్భంగా అయినా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున మేము అడిగే 21 ప్రశ్నలకైనా కనీసం మీరు సమాధానం చెప్పాలి.

బండి సంజయ్ 21 ప్రశ్నలు ఇవే..

1) 2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసి తెలంగాణ ప్రజలకు మీరు అనేక హామీలు ఇచ్చారు. ఇందులో ఎన్ని అమలు చేశారు..? ఎన్ని అమ‌లు చేయ‌లేదు..? ద‌ఈనిపై చ‌ర్చించ‌డానికి మీరు సిద్ద‌మేనా..? క‌నీసం దీనిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయ‌గ‌ల‌రా..?

2) ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేసిన మీరు.. మీ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఇది వాస్తవం కాదా? దీనికి మీ సమాధానమేమిటి?

3) నిరుద్యోగ భృతి నెలకు రూ.3,016 చొప్పున ఇప్పటి వరకు తెలంగాణలో ఎంత మందికి విద్యావంతులైన యువతకు ఇచ్చారు? ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి ఇస్తారు?

4) బిస్వాల్‌ కమిటి నివేదిక ప్రకారం రాష్ట్రప్రభుత్వ శాఖల్లో 1 లక్షా 91 వేల ఖాళీలుండగా కేవలం 81 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామనడం నిరుద్యోగ యువతను మోసం చేయడం కాదా? మిగతా పోస్టుల భర్తీ ఎప్పుడు ప్రారంభిస్తారు?

5) పోడుభూములకు పట్టాలు ఇవ్వడం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లపై అర్డినెన్స్‌ తేవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అలసత్వం నిజం కాదా?

6) దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇవ్వకపోవడం, దళిత బంధును విస్తరించి రాష్ట్రమంతా అమలు చేయడంలో మీ ప్రభుత్వ వైఫల్యం మీకు కనిపిస్తుందా?

7) దళితున్ని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చేస్తారు? కనీసం దళితున్ని మీ పార్టీ అధ్యక్షునిగా అయినా చేస్తారా? ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి ఎస్సీ, ఎస్టీలను మీ ప్రభుత్వం మోసగించిన మాట వాస్తవం కాదా? 125 ఫీట్ల డా.బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎప్పుడు ఆవిష్కరిస్తారు?

8) బీసీబంధు పథకాన్ని ఎప్పటినుంచి ప్రవేశపెడతారు? బిసి, ఎంబిసి కార్పోరేషన్లకు నిధుల కేటాయింపు, ఖర్చులపై మీరు ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందా? బీసీలకు ఇవ్వాల్సిన 3 వేల కోట్ల ఫీజురియంబర్స్‌మెంట్‌ నిధులను ఎప్పుడు మంజూరు చేస్తారు? ఆత్మగౌరవ భవనాలను ఎప్పుడు నిర్మిస్తారు?

9) ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని 2014 లో ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజ్‌ నెం.7లో మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 8 సంవత్సరాల కాలంలో ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించారో మీరు వివరాలు అందించగలరా?

10) మీ 8 సంవత్సరాల పాలనలో దాదాపు 30 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మీ అసమర్థ పాలన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి మీ సమాధానమేంటి?

11) రైతులకు లక్షరూపాయలు రుణమాఫీ చేస్తామని 2014, 2018 ఎన్నికల్లో మీరిచ్చిన హామీ ఎంతమేరకు నెరవేర్చారు? మాకున్న సమాచారం ప్రకారం ఇంకా 31 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేయాల్సి ఉంది. ఈ హామీని ఎప్పటిలోగా మీరు నెరవేరుస్తారు?

12) వరి వేస్తే ఉరి అని, రైతాంగాన్ని భయబ్రాంతులకు గురిచేసి రైతులు వరి పండించకుండా అడ్డుకుంది మీరు కాదా. తెలంగాణ రైతాంగాన్ని నిలువునా ముంచి కేంద్రంపై మొసలి కన్నీరు కార్చడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?

13) కేసీఆర్‌ జమానా-అవినీతి ఖజానా అంటూ సకలజనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు. ప్రగతిభవన్‌ అవినీతి భవన్‌గా, తెలంగాణ ద్రోహులకు నిలయంగా మారిందన్నది వాస్తవం? దీనికి మీ జవాబు ఏంటి? 2014లో మీరు ముఖ్యమంత్రి పదవిచేపట్టే నాటికి మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యుల, మీ బంధువుల ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? మీ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా? దీనిపై చర్చకు మీరు సిద్ధమా?

14) కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రీడిజైనింగ్‌ పేరిట అంచనాలు పెంచి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు కొల్లగొట్టారా లేదా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతరసాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, విద్యుత్‌ ప్రాజెక్టుల, విద్యుత్‌ కొనుగోళ్లు, ప్రభుత్వ భూములు అమ్మకాల్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వీటికి సంబంధిచిన ఫైల్స్‌, సంబంధిత పత్రాలు అఖిలపక్షం ముందు పెట్టి దీనిపై చర్చించడానికి మీరు ముందుకువస్తారా?

15) 2014 ఎన్నికల సందర్భంగా మీరు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేజీ నెం.14లో బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అనే అంశం కింద ''ఇల్లు లేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో 3 లక్షల రూపాయల వ్యయంతో రెండు పడక గదులు, ఒక హాలు, ఒక వంటగది, స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్న ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని మీరు హామీ ఇచ్చారు. ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించారు? ఎన్ని పేదలకు ఇచ్చారు? వీటికి లెక్కలు చెప్పగలరా? ఈ ఇళ్లు మాకు చూపించగలరా?

16) ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 91 వేల ఇండ్లను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేస్తే, అందులో ఎన్ని ఇండ్లను పూర్తి చేశారు? వాటి వివరాలను ఇవ్వగలరా? గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించారు..? మిగితా 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించారు? వీటి వివరాలు తెలంగాణ ప్రజలకు తెలుపుగలరా?

17) 2014 నుండి 2022 వరకు కేంద్రంలోని ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నుండి వివిధ సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు మంజూరు చేసింది, ఎన్ని నిధులు వచ్చాయి తదితర అంశాలపై మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ చర్చకు మీరు సిద్ధమా?

18) నిజాం షుగర్‌ పునరుద్ధరణ, నిజామాబాద్‌ జిల్లాలో చెరుకు పరిశోధనా కేంద్రం, పాలమూరు జిల్లాలో చేపల పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఎన్నికల హామీ ఏమైంది? ఈ హామీ ఎప్పుడు నెరవేరుస్తారు?

19) మిషన్‌ కాకతీయను 'కమీషన్‌ కాకతీయగా మార్చి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీ పార్టీ వారు దోచుకోలేదా? దీనిపైనా జ్యూడిషల్‌ ఎంక్వయిరీకి మీరు సిద్ధమా? మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో కమిషన్ల కోసం ప్రాధాన్యం లేని చెరువులకు పనులు చేపట్టారని 'కాగ్‌' తప్పుపట్టిన మాట వాస్తవం కాదా?

20) కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా 299 టీఎంసీలు నీటి వాటాకు ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి మీరు తీరని ద్రోహం చేసిన మాట వాస్తవం కాదా?

21) దేశంలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తెలంగాణలో ఎక్కువగా ఉన్న మాట వాస్తవం కాదా? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయి, తెలంగాణలో ఎంత ఉంది? దీనిపైన చర్చించడానికి మీరు సిద్ధమా?

Next Story