త్వరలోనే తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు: బండి సంజయ్‌

Bandi Sanjay comments on cm kcr over munugode by election. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నుంచి 12 మంది

By అంజి  Published on  4 Aug 2022 9:55 AM GMT
త్వరలోనే తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు: బండి సంజయ్‌

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. 12 మంది ఎమ్మెల్యేలు.. టీఆర్‌ఎస్‌లో కొనసాగితే పొలిటికల్‌ ఫ్యుచర్‌ ఉండదనే నిర్ణయానికి వచ్చారన్నారు. త్వరలోనే మునుగోడు తరహానే రాష్ట్రంలో మరిన్ని బై ఎలక్షన్‌లు రాబోతున్నాయని చెప్పారు. నియోజకవర్గ ప్రజల చేత ఒత్తడి చేయించుకుని ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారన్నారు. చీకోటి ప్రవీణ్‌ కుమార్‌ క్యాసినో వ్యవహారం వెనుక కేసీఆర్‌ ఫ్యామిలీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేయి ఉందని బండి సంజయ్‌ ఆరోపించారు.

మునుగోడు బై ఎలక్షన్‌లో బీజేపీ గెలిచి తీరుతుందని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను తీర్చిదిద్దబోయే ఎన్నిక కాబోతుందన్నారు. బీజేపీ అధికారం చేపట్టాక.. నయీం కేసుతో పాటు మొత్తం వ్యవహారంపై ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు చేస్తామన్నారు. నయీం ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కొనొద్దని కోరారు. ఎవరైనా ఆ పని చేస్తే భవిష్యత్‌లో ఇబ్బంది పడతారని హెచ్చరించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారని, అదే సమయంలో ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారని పేర్కొన్నారు.

బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వాన్ని నమ్మే వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామని బండి సంజయ్‌ అన్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 62 సీట్లతోపాటు 47 నుంచి 53 శాతం ఓట్లు వస్తాయని అనేక సర్వేల్లో వెల్లడైందని, వచ్చే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరగబోతోందని అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. మీడియా మిత్రులకు ఇళ్లు కట్టించే.. బాధ్యత తీసుకుంటామని బండి సంజయ్ అన్నారు.

Next Story
Share it