ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి..బండి సంజయ్ భావోద్వేగ ట్వీట్

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాక బండి సంజయ్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  4 July 2023 1:13 PM GMT
Bandi Sanjay, BJP, Telangana, Tweet,

 ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి..బండి సంజయ్ భావోద్వేగ ట్వీట్

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాక బండి సంజయ్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి అధికారికంగా వీడ్కోలు పలుకుతున్నా అని తెలిపారు. జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు రాకముందే ముగిసిపోతుంటాయని రాసుకొచ్చారు. తన పదవీ కాలంలో పొరపాటున ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు బండి సంజయ్.

అయితే.. బండి సంజయ్‌ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విచారించదగ్గ ఘటనలు లేవని అందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు. అందరూ తనకు మర్చిపోలేని మధురానుభూతులు అందించారని అన్నారు. అరెస్ట్‌ల సమయంలో, దాడులకు గురైన సమయంలో, ఉల్లాసంగా ఉన్నప్పుడు ఇలా ప్రతి సంఘటనల్లోనూ తనకు తోడుగా వెన్నంటే నిలిచారని బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ పాలనపై వ్యతిరేకంగా చేసిన పోరాటంలో కార్యకర్తల పాత్ర ఎనలేదనిదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు హ్యాట్సాఫ్‌ చెప్పారు.

అరెస్ట్‌లు, దాడులకు భయపడకుండా, ఎంతో నిబద్ధతతో బీజేపీ కార్యకర్తలు పని చేశారని కొనియాడారు బండి సంజయ్. వాన, ఎండ ఇలా ఏవీ చూడకుండా ఎల్లవేళలా తోడుగా నిలబడ్డారని బండి సంజయ్‌ గుర్తు చేసుకున్నారు. తానెప్పుడు కార్యకర్తల్లో ఒకడినని, ఇకపైనా కార్యకర్తగా కొనసాగుతానని బండి సంజయ్‌ చెప్పారు. ఇక తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని జాతీయ నాయకత్వం నియమించింది. కిషన్‌రెడ్డికి ఈ సందర్భంగా బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. కిషన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ అభ్యున్నతి కోస మరింత ఉత్సాహంతో పని చేస్తానని బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. ముఖ్యంగా తనని ఈ స్థాయిలో నిలిపిన కరీంనగర్‌ ఓటర్లు, కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు బండి సంజయ్.

తెలంగాణ బీజేపీలో ఉన్నత అవకాశాలు ఇచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పార్టీ అగ్రనేతలకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story