ప్రజా సంగ్రామ యాత్ర చూసి కేసీఆర్ వణికిపోతున్నారు: బండి సంజయ్

Bandi sanjay begins praja sangrama yatra from yadagiri gutta. ప్రజా సంగ్రామ యాత్ర చూసి కేసీఆర్‌ వణకిపోతున్నాడని బండి సంజయ్‌ అన్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన

By అంజి  Published on  2 Aug 2022 12:12 PM GMT
ప్రజా సంగ్రామ యాత్ర చూసి కేసీఆర్ వణికిపోతున్నారు: బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్ర చూసి కేసీఆర్‌ వణకిపోతున్నాడని బండి సంజయ్‌ అన్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన ఆయన.. యాదాద్రి జిల్లా వంగపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. గోల్కొండ కొఓట మీద కాషాయం జెండా ఎగరేస్తామన్నారు. చార్మినార్ దగ్గర సభ పెట్టి సత్తా చాటామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవగానే మొదట భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటామని చెప్పారు. ప్రతి కార్యకర్త ఉగ్ర నరసింహస్వామి అవతారమెత్తి కేసీఆర్‌ గద్దె దించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మూడో విడత సంగ్రామ యాత్ర యాదగిరి గుట్ట నుంచి ప్రారంభించడంతో సీఎంకు భయం పట్టుకుందని చెప్పారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ముంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన తన గతి ఏమవుతుందోనని సీఎం ఆందోళన చెందుతున్నాడని సంజయ్‌ అన్నారు. కేసీఆర్ సీఎం హోదాలో ఢిల్లీకి పోతే షెడ్యూల్ ఉండదా అని ప్రశ్నించిన బండి సంజయ్.. అసలు ఆయన ఎందుకు ఢిల్లీకి వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. భోజనం కోసం కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గోస పడుతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంకి నిజాయితీ ఉంటే ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాల్ల్లో పురుగుల అన్నం పెడుతున్నారని, అదే అన్నం కేసీఆర్ మనవడు తింటుండా? అని బండి ప్రశ్నించారు.

నల్గొండ జిల్లాలో బీజేపీ ఎక్కడుందని అనేవాళ్లకు తామేంటో చూపించామని, ఖమ్మంలో కూడా నిరూపిస్తామని బండి సంజయ్‌ అన్నారు. ''రజాకార్లను తరిమికొట్టిన గడ్డ నల్గొండ. నల్గొండ గడ్డకు శక్తి ఉంది. రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఆయన కుటుంబం గజ గజ వణికిపోతోంది. తెలంగాణలో ఏమీ చేయని కేసీఆర్‌ ఢిల్లీ రాజకీయ సమీకరణాలు మారుస్తానంటున్నారు. రైతుల రుణమాఫీ చేయకుండా నట్టేట ముంచారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు ఎంతమందికి వచ్చింది. ఉచితంగా యూరియా ఇస్తానని కేసీఆర్‌ చెప్పారు. ఒక్కరికైనా.. ఉచితంగా యూరియా ఇచ్చారా.'' అని బండి సంజయ్ ప్రశ్నించారు.

కేసీఆర్‌ తన హయాంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని సంజయ్ ఆరోపించారు. రైతులను కేసీఆర్ నిండా ముంచారని అన్నారు. వాసాలమర్రి గ్రామ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. కేసీఆర్‌ చేతగాని పాలన వల్ల చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారిని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.మొదటి విడత పాదయాత్రలో బీజేపీ అధికారంలోకి వస్తే... ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, రెండో విడతలో ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు అమలుచేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని బండి ప్రస్తావించారు. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్న విషయాన్ని ప్రజలకు చెప్పి, అవగాహన కల్పించేందుకే మూడో విడత పాదయాత్ర చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చుంటే దేశం మొత్తం ఇప్పుడు బీజేపీని నిలదీసేదని అన్నారు. ఏం ముఖం పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి జనం చేతికి చిప్ప ఇచ్చాడని బండి సంజయ్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు అగ్రకులాల పేదలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందపెట్టి, బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని బండి హామీ ఇచ్చారు.


అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొడతాం : గజేంద్రసింగ్ షెకావత్

తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందని షెకావత్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలకు మాత్రమే కేసీఆర్ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. అణగారిన వర్గాలంటే కేసీఆర్‌కు గిట్టదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని షెకావత్ అన్నారు. యాదగిరిగుట్టలో జరిగిన బీజేపీ ప్రజా సంగ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన షెకావత్..సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందలు తెలిపారు.

తెలంగాణలో జంగ్ సైరన్ మోగించారని.. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్న ఆయన.. ఇక్కడి ప్రజలు సుష్మా స్వరాజ్ను చిన్నమ్మగా పిలుచుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో పవిత్ర స్థలమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తన జీవితంలో మరిచిపోలేని ఘటనగా పేర్కొన్నారు.


Next Story