సీబీఐ తన వెబ్ సైట్‌లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్‌ని క్షుణ్ణంగా పరిశీలించానని, అందులో పేర్కొన్న నిందితుల జాబితాను కూడా చూశానన్నారు ఎమ్మెల్సీ కవిత. దానిలో తన పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలిపారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీన తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని చెప్పారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత తెలిపారు.
ఈ పరిణామాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని.. సీబీఐ విచారణకు పోతే అరెస్ట్ చేస్తారని కేసీఆర్ బిడ్డకు భయం పట్టుకుందని ఆరోపించారు. అందుకే విచారణకు వెళ్లకుండా కొత్త డ్రామాలకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని అన్నారు. కవితను అరెస్టు చేస్తే తెలంగాణ బిడ్డను అరెస్టు చేసినట్టుగా తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. లిక్కర్ దందాలో కేసీఆర్ బిడ్డ జైలుకు వెళ్లడం ఖాయం. దమ్ముంటే.. లిక్కర్ దందాలో విచారణకు హాజరై, తమ నిజాయితీ ఏంటో నిరూపించుకోవాలని బండి సంజయ్ చెప్పారు.