అలయ్ బలయ్ కు వేళాయె
తెలంగాణ సంప్రదాయంలో అలయ్ బలయ్ కార్యక్రమానికి ప్రత్యేకత ఉంది.
By Medi Samrat
తెలంగాణ సంప్రదాయంలో అలయ్ బలయ్ కార్యక్రమానికి ప్రత్యేకత ఉంది. ఇక ఈ ఏడాది అలయ్ బలయ్-2023 కార్యక్రమాన్ని అక్టోబర్ 25న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నట్లు అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సమక్షంలో రామ్ నగర్ లో జరిగిన ఫౌండేషన్ ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ట్రస్టీలు బి.జనార్దన్ రెడ్డి, డాక్టర్ ఎం.సత్యం యాదవ్, ఆర్.ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ గౌతమ్ రావు, బి శ్యాంసుందర్ గౌడ్, రామచంద్ర, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అలయ్-బలయ్ కార్యక్రమానికి ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమానికి అన్నిపార్టీల నేతలు, ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరు అవుతారు. అత్యున్నత స్థానంలో ఉన్నవారి నుంచి... చిరు ఉద్యోగి వరకు ఒకే వేదికను పంచుకునే కార్యక్రమమే అలయ్ బలయ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వారిని, ప్రముఖ క్రీడా, సాహిత్య, సాంస్కృతిక రంగ ప్రముఖులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించనున్నారు.