గ్రూప్-1 నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎప్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ ఆరోపించారు. పేపర్ లీకేజీ తో ఇప్పటికే పరీక్ష ఒకసారి రద్దు కాగా.. ఇప్పుడు మరోసారి రద్దైందని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని హైకోర్టు కూడా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వారితోనే పరీక్ష నిర్వహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎగ్జామ్‌లో బయోమెట్రిక్ లేకుండా ఓఎమ్ఆర్‌లో గందరగోళం సృష్టించారని.. దీనిపై కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో హైకోర్టుకు వెళ్లామని తెలిపారు. ఎగ్జామ్ రాసిన దానికన్నా అదనంగా 248 ఓఎమ్ఆర్ షీట్ లు వచ్చాయని.. కోర్టులో ఈ అంశం వెల్లడించామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ లో ఉన్న గైడ్ లైన్స్ అమలు చేయాలి లేదంటే రద్దు చేయచ్చని సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని వివరించారు. ఈ మేరకు పిటిషన్ వేసిన వాటిని సమర్థిస్తూ గ్రూప్-1 ను హైకోర్టు రెండోసారి రద్దు చేసిందని తెలిపారు.
మొదటిసారి రాసిన వారిలో పోలిస్తే టీఎస్‌పీఎస్సీ మీద నమ్మకం లేక రెండవ సారికి 10 శాతం అభ్యర్ధులు తగ్గారని వెల్లడించారు. తక్షణమే టీఎస్‌పీఎస్సీ ని రద్దు చేయాలని.. పరీక్ష రాసిన అభ్యర్థులకు లక్ష రూపాయలు నష్టపరిహారం కింద ఇవ్వాలని డిమాండ్ చేశారు.