జగన్ హాయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏమైంది.? : బాల్క సుమన్

చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా అని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు

By Medi Samrat  Published on  4 Oct 2024 9:40 AM GMT
జగన్ హాయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏమైంది.? : బాల్క సుమన్

చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా అని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సూటుకేస్ కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే జైలుకు పోవటం‌ ఖాయం అని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి కాదు కదా.. భగవంతుడు కూడా వివేక్ ను కాపాడలేర‌ని అన్నారు.

ఈడీ కేసు జరుగుతుంటే‌.. తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వివేక్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు వెళ్తాం అన్నారు. వివేక్‌‌.‌. అక్రమంగా వందల కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేశాడు.. తెలంగాణ పోలీసులకు స్వామి భక్తి ఎక్కువైందని ఆరోపించారు. పోలీసులు రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వత్తుతున్నారని.. అత్యుత్సాహం ప్రదర్శిస్తోన్న పోలీసులు భవిష్యత్తులో బలికాక తప్పదని హెచ్చరించారు.

ఈడీ విచారణ జరుగుతోన్న కేసును పోలీసులు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని.. ఏపీ తాజా పరిణామాలను తెలంగాణ పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు. జగన్ హాయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్ ల పరిస్థితి ఏమైంది.. తప్పు చేసిన పోలీస్ అధికారులను చంద్రబాబు ఇంటికి పంపారు.. చేసిన తప్పుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని సుమన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Next Story