Telangana: ఎన్నికల్లో పోటీ చేయను.. ప్రచారం చేయను: బాబూమోహన్
ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ కీలక ప్రకటన చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 3:00 PM ISTTelangana: ఎన్నికల్లో పోటీ చేయను.. ప్రచారం చేయను: బాబూమోహన్
ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ప్రచారంలో కూడా పాల్గొనబోను అంటూ స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన బాబూమోహన్ ఈ సంచలన కామెంట్స్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేసి.. తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారని బాబూమోహన్ అన్నారు. ఈ సందర్భంగా అర్హులకే టికెట్ ఇవ్వాలని పెద్దలను కోరుతున్నానని చెప్పారు. బీజేపీలో తనకు చాలా అవమానాలు జరిగాయని చెప్పారు బాబూమోహన్. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బీజేపీలో ఐదేళ్లుగా పని చేస్తున్నానని.. నిన్నటి వరకు నియోజకవర్గం మీటింగ్ కూడా తానే పెట్టానని.. అలాంటిది తన పేరు ఫస్ట్ లిస్ట్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు. తొలి జాబితాలో తన పేరుని ప్రకటించకపోవడం వల్ల తలవంపుగా ఉందన్నారు బాబూమోహన్. టికెట్ ఎందుకు ఇవ్వటం లేదనే విషయాన్ని కూడా చెప్పకపోవడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాక తన గురించి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు బాబూమోహన్. తనకు.. తన కొడుకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఉన్నదే ఒక్క కొడుకు అని.. తమ మధ్య ఎందుకు చిచ్చు పెడుతున్నారంటూ ప్రశ్నించారు. ఉరితీసేవాడికి కూడా చివరి అవకాశం ఇస్తారని అన్నారు. అలా కాకుండా తనకు కనీసం సమాచారం ఇవ్వడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆవేదన చెందారు బాబూమోహన్. పార్టీలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తాను ఇక ఎందుకు పార్టీలోనే ఉండాలని ప్రశ్నించుకున్నారు. బీజేపీ పెద్దలతో మాట్లాడి.. రాష్ట్ర బీజేపీ నాయకుల వైఖరి చూసిన తర్వాత బీజేపీలో ఉండాలా లేదా అనేది నిర్ణయించుకుంటానని బాబూమోహన్ తెలిపారు.