కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..! అక్టోబర్ 17న మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ మధ్య కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీ జరగనుంది. మల్లికార్జున్ ఖర్గేకు రాహుల్ గాంధీ కుటుంబం మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి అని కూడా అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గేకే ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయని ఓ వర్గం చెబుతూ వస్తోంది. దీనిపై శశి థరూర్ తాజాగా మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో తానొక అండర్ డాగ్ అనే విషయం గురించి తనకు తెలుసన్నారు. గాంధీ కుటుంబం నిష్పాక్షికమైనదని, మార్పుకు రాయబారి కావాలని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీదారు థరూర్ అన్నారు. "ఒకరు అధికారిక అభ్యర్థిని, నేను ఎవరూ కాను అని కొందరు అంటున్నారు. గాంధీ కుటుంబం నిష్పక్షపాతమైనది. నేను, మల్లికార్జున్ ఖర్గే స్నేహితులం. మా పని తీరు ఒక్కటే తేడా. నేను మార్పుకు రాయబారిగా ఉండాలనుకుంటున్నాను" అని ఆయన అన్నారు. "ప్రధాని మోదీ పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉండడంతో 2024 నాటికి కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే నా లక్ష్యం. అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ద్వేషపూరిత ప్రసంగం కూడా ఎక్కువగా ఉంది.. ప్రజలలో మార్పు రావాలని కోరుకుంటున్నారు" అని ఆయన అన్నారు.