ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. కలకలం రేపుతున్న ఆడియో క్లిప్
Audio Clip Goes Viral In MLAs Purchase Case. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Medi Samrat
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి, నంద కుమార్‌లపై ఆరోపణలు చేసిన బీజేపీ.. రహస్య ఆపరేషన్‌కు సంబంధించిన ఫోన్ సంభాషణ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. 14 నిమిషాల ఫోన్ సంభాషణలో రామచంద్ర భారతి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు ముందే మా ఆర్గనైజేషన్‌లో చేరాలని పట్టుబట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ పేరు ఫోన్ సంభాషణలో ప్రస్తావించబడింది. చేరికల విషయమై పైస్థాయి పెద్దల నుంచి కూడా క్లియరెన్స్ ఉందని.. పార్టీలో నెంబర్-1, నెంబర్-2 వ్యక్తులుగా ప్రస్తావించారు. సంభాషణలో.. పార్టీలో చేరే అవకాశం ఉన్న ఇతర టీఆర్‌ఎస్ నాయకుల సంఖ్యపై రామచంద్ర భారతి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను అడిగారు. "మాకు అర్హత కలిగిన నాయకులు కావాలి" అని ఆయన చెప్పారు. అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటామని, చింతించవద్దని ఎమ్మెల్యేకు హామీ కూడా ఇచ్చారు. ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడవద్దని ఆయన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను కోరారు.
ఆరోగ్య సమస్యల కారణంగా అక్టోబర్ 25 తర్వాత కలుద్దామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతో రామచంద్ర భారతి అన్నారు. ఇంతలో నంద కుమార్ కలగజేసుకుని సూర్యగ్రహణాన్ని ఉందంటూ అక్టోబర్ 25 తర్వాత సమావేశాన్ని షెడ్యూల్ చేద్దామని చెప్పడం ఆడియోలో వినవచ్చు. మరికొందరి పేర్లు ప్రస్తావించబోయిన నందును ఎమ్మెల్యే అడ్డుకోవడం.. ఈ విషయం గోప్యంగా ఉంచండి అని రామచంద్ర భారతిని ఎమ్మెల్యే కోరడం వంటి విషయాలపై తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ వ్యవహారంలో పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తుల రిమాండ్‌ను కోర్టు రిజెక్ట్ చేయడం.. ముందు నుంచి ఆధారాలు ఏమైనా ఉంటే బయటపెట్టండని బీజేపీ అనడం.. వంటి సంఘటనల తర్వాత ఆడియో వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగింది. బయటపడ్డ ఈ ఆడియో సంభాషణను ఎవరు రికార్డ్ చేశారు.. ఎవరు బయటపెట్టారనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.