సికింద్రాబాద్ కంటోన్మెంట్: కార్మిక వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల ప్రయత్నాలు
సికింద్రాబాద్.. హైదరాబాద్‌లోని అతి పురాతన ప్రాంతాలలో ఒకటి. హైదరాబాద్ తో పాటూ సికింద్రాబాద్ కూడా బాగా అభివృద్ధిని సాధించింది.
By Bhavana Sharma Published on 14 Nov 2023 7:49 AM GMTసికింద్రాబాద్ కంటోన్మెంట్: కార్మిక వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల ప్రయత్నాలు
సికింద్రాబాద్.. హైదరాబాద్‌లోని అతి పురాతన ప్రాంతాలలో ఒకటి. హైదరాబాద్ తో పాటూ సికింద్రాబాద్ కూడా బాగా అభివృద్ధిని సాధించింది. స్థానికుల జనాభా అత్యధికంగా ఉన్న నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఈ సీటుపైనే ఉంది. 119 మంది సభ్యులున్న తెలంగాణ శాసనసభకు నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడికానున్నాయి.
సికింద్రాబాద్ నియోజకవర్గం:
సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం హైదరాబాద్ జిల్లా పట్టణ భూభాగంలో సికింద్రాబాద్ లోక్‌సభలో భాగంగా ఉంది. ఈ నియోజకవర్గం నుండి 2014 మరియు 2018లో బీఆర్ఎస్ (TRS) రెండుసార్లు గెలిచింది. బీఆర్‌ఎస్‌కు చెందిన టి పద్మారావు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,37,955 మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో 1,21,223 మంది పురుషులు, 1,16,708 మంది మహిళలు, 24 మంది ఇతరులు ఉన్నారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో, సికింద్రాబాద్‌లో 55.39% ఓటింగ్ నమోదు కాగా, 2014లో 57.00% పోలింగ్ నమోదైంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ టి .పద్మారావు పేరును ప్రతిపాదించగా, కాంగ్రెస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్ ముధిరాజ్‌ను బరిలోకి దింపింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సతీష్‌ను రంగంలోకి దించగా, బిఎస్‌పి తమ అభ్యర్థిగా మదన్ మోహన్ వేములవాడను ఎంపిక చేసింది. 2018లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిపై 45,470 ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపొందారు.
ఈసారి ఎవరికి టికెట్ ఇచ్చారు?
మేకల సారంగపాణిని బీజేపీ రంగంలోకి దింపింది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా టీ పద్మారావు, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదం సంతోష్‌కుమార్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత స్థానిక అభ్యర్థి ఆదం సంతోష్‌కుమార్ ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. సంతోష్ కుమార్ కార్యకర్త స్థాయి నుండి ఎదిగారు. సంతోష్ 1984లో NSUI వైస్ ప్రెసిడెంట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో యూత్ కాంగ్రెస్ కు BC సెల్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1987లో ఎన్‌ఎస్‌యుఐ హైదరాబాద్ సిటీ జాయింట్ సెక్రటరీగానూ, ఆ తర్వాత 2013లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగానూ బాధ్యతలు చేపట్టారు.
తన కళాశాల విద్యను అభ్యసిస్తున్నప్పుడు.. సంతోష్ కుమార్ భారతీయ రైల్వేలో వృత్తిని ప్రారంభించాడు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (NFIR), సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ (S.C.R.E.S) అనే రెండు ప్రముఖ రైల్వే యూనియన్లకు నాయకుడిగా ఎన్నిక అయ్యారు. ఈ రెండు యూనియన్లు INTUC (ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్)తో అనుబంధంగా ఉన్నాయి. ఆ తరువాత సంతోష్ కుమార్ రైల్వే నుండి స్వచ్ఛంద పదవీ విరమణను తీసుకుని.. క్రియాశీల రాజకీయాల్లో భాగమయ్యారు. ‘‘గత నాలుగేళ్లుగా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. 17 ఏళ్ల తర్వాత ఇక్కడి అసెంబ్లీకి స్థానిక అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా భార్య ఉమాదేవి కూడా రాజకీయ నాయకురాలు. ఆమె రెండుసార్లు కార్పొరేటర్. ఇక్కడి స్థానికులు నాకు అవకాశం ఇస్తారని నేను నమ్ముతున్నాను" అని అన్నారు.
తుకారాం గేట్‌లోని కూరగాయల దుకాణం యజమాని శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రాజకీయ నాయకుడూ అది చేస్తానని.. ఇది చేస్తానని వాగ్దానాలు చేస్తారు.. కానీ మాకు అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో ఎన్నో మురికివాడలు ఉన్నాయి.. రోడ్లు అస్సలు సరిగా లేవు. ఇతర మార్గాల్లో వెళ్లాలంటే.. సరైన సదుపాయాలు లేవు. ఇక్కడి ప్రజలు చాలా మంది శ్రమను నమ్ముకుని బతుకుతూ ఉన్నారు. తరచుగా బస్సులలో ప్రయాణం చేయడం అవసరం.. ఎప్పుడూ షేరింగ్ ఆటోలపై ఆధారపడలేము. ఈ సమస్యలను పరిష్కరించే వ్యక్తి మాకు కావాలి. ” అని అన్నారు.
స్థానికురాలు కనకమ్మ మాట్లాడుతూ, “వైన్ షాపుల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. రోడ్లు ఇరుకుగా ఉండడంతో మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వారు వాహనాలను యథేచ్ఛగా రోడ్డు మీద పార్కింగ్ చేస్తున్నారు. చాలా మంది శ్రామిక మహిళలు రాత్రి 8 నుండి రాత్రి 9 గంటల మధ్య ఇంటికి వస్తారు.. ఆ సమయంలో మందుబాబుల కారణంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు." అని తెలిపారు.
టి పద్మారావు గత పదేళ్లుగా సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
60 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి కర్రి నారాయణ మాట్లాడుతూ.. "తెలంగాణ ఏర్పడక ముందు పద్మారావుకు ఈ నియోజకవర్గంలో మంచి ఆదరణ ఉండేది. అతను చాలా విషయాలకు సంబంధించి ప్రజలకు వాగ్దానం చేశారు. చాలా వాటిని నెరవేర్చారు. తగినంత నీరు ఉండేలా చూసుకున్నారు. స్లమ్ ఏరియాల్లో నీటి సమస్య ఉండదు. వాణిజ్య ప్రాంతం కాదు కాబట్టి ఈ ప్రాంతంలో భారీ అభివృద్ధిని ఆశించలేము. కాబట్టి ఈ నాయకులు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. పద్మారావు ఎన్నో పనులు చేశారు" అని తెలిపారు.