సంచలనం : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం
Attempt to buy TRS MLAs. మునుగోడు ఉప ఎన్నిక వేళ తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కింది.
By Medi Samrat Published on 26 Oct 2022 9:30 PM ISTమునుగోడు ఉప ఎన్నిక వేళ తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కింది. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరుపుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాఫిక్‌గా మారింది. నగర శివారులో ఓ కీలక నేత ఫామ్ హౌస్ కేంద్రంగా ఈ తతంగం జరిగినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు ముందస్తుగా ఇచ్చిన సమాచారంతో అలర్టై.. సైబరాబాద్, ఎస్‌వోటీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడినట్లు సమాచారం.
పీఠాధిపతి రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు అనే ముగ్గురు వ్యక్తులు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వల వేసి.. వారితో బేరసారాలు నిర్వహిస్తుండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఈ డ్రామాకు చెక్ పెట్టారు. పట్టుబడిన ముగ్గురు వ్యక్తులు.. టీఆర్ఎస్‌కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్హాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కొనుగోలు చేసేందుకు వారితో బేరసారాలు జరిపినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమాచారంతోనే ఈ ఆపరేషన్ చేపట్టినట్టు సైబరాబాద్ సీపీ స్టీపెన్ రవీంద్ర మీడియాతో అన్నారు. విచారణ కొనసాగుతుంది. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు.