రెండోసారి కరోనా బారిన పడిన స్పీకర్ పోచారం
Assembly Speaker Pocharam Srinivas Reddy tests positive for Corona 2nd time.కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది
By తోట వంశీ కుమార్
కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. దీంతో గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రెండో సారి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీలో పోచారం చికిత్స పొందుతున్నారు. కాగా.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. కాగా.. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీకర్ పోచారం సూచించారు.
గతేడాది నవంబర్ 26న పోచారం తొలిసారి కరోనా బారిన పడ్డారు. నవంబర్ 21న పోచారం మనవరాలి వివాహం హైదరాబాద్‌లో జరిగింది. పెళ్లి తంతు ముగిసిన తరువాత తనతో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించుకోగా.. పోచారానికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కాగా.. మిగిలిన వారందరికి నెగెటివ్‌గా వచ్చింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కరోనా రెండు టీకా డోసులు తీసుకున్నప్పటి కరోనా బారిన పడడం గమనార్హం.
ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 1,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 7,07,162కి చేరింది. నిన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటికి నుంచి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,054కి చేరింది. ఒక్క రోజులో 1,620 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులు ఉన్నాయి.