రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవా?: కేటీఆర్
రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
By అంజి Published on 30 Sept 2024 11:00 AM ISTరోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవా?: కేటీఆర్
రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ''మాజీ సర్పంచుల సంగతి సరే.. చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు అవుతున్నారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ తెచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆటకెక్కించారు. ఆసరా పెన్షన్‌తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని పరిస్థితి కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా?'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అవ్వా తాతలకే కాదు చివరకు గ్రామ పనులకు కూడా ఆసరా ఫించన్ ఆసరగా నిలుస్తోందన్నారు. ఆసరా పెన్షన్లు వృద్దులకు సరైన సమయానికి అందక అల్లాడుతుంటే దాచుకున్న డబ్బుతో తప్పని పరిస్థితుల్లో రోడ్లు వేస్తున్నారని అన్నారు.
''అప్పుడు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని ఫుల్ పేజీ ప్రకటనలు, స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు. ఇప్పుడు 300 రోజుల తర్వాత, ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని, కార్యకర్త గాని ప్రజలకు సమాధానం చెప్తారా ? ఢిల్లీ నుండి రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్తారా ?'' అని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ విమానం ఎక్కడం..దిగడమే సీఎంకే సరిపోతున్నదని అన్నారు. పల్లెలేమో నిధుల్లేక నీరసంతో తల్లడిల్లిపోతున్నాయని, ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కూడా విడుదల చేయకుండా గ్రామాలను గబ్బుపట్టిస్తున్నారని కేటీఆర్ అన్నారు. పంచాయతీల్లో పాలన గాడితప్పిందని, పారిశుద్ధ్యం పడకేసిందని, ప్రజలు రోగాల పాలైతున్నారని అన్నారు.