​సర్పంచ్ ఎన్నికల రోజునే ఏపీపీ పరీక్షా? తక్షణమే వాయిదా వేయాలి: హరీష్ రావు

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్షను నిర్వహించడం సరికాదని వెంటనే ఆ పరీక్షను వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

By -  Knakam Karthik
Published on : 9 Dec 2025 11:06 AM IST

Telangana, Sarpanch elections, Harish Rao, Assistant Public Prosecutor Exam, Congress Government

​సర్పంచ్ ఎన్నికల రోజునే ఏపీపీ పరీక్షా? తక్షణమే వాయిదా వేయాలి: హరీష్ రావు

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజునే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్షను నిర్వహించడం సరికాదని వెంటనే ఆ పరీక్షను వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం హైకోర్టు సీనియర్ న్యాయవాది శివ శేఖర్ ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం మాజీ మంత్రి హరీష్ రావుని కలిసి వినతిపత్రం సమర్పించారు. డిసెంబర్ 14న జరగాల్సిన ఏపీపీ పరీక్షను వాయిదా వేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరారు.

​ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ​తెలంగాణలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ 14 న రాత పరీక్ష నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, అదే రోజు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ పరీక్షకు దాదాపు 4,000 మంది న్యాయవాదులు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాలు హైదరాబాదులో ఉన్నాయి, కానీ అభ్యర్థుల ఓట్లు వారి సొంత గ్రామాల్లో ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజంతా పరీక్ష ఉండటంతో, అభ్యర్థులు తమ గ్రామాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం అసాధ్యం.

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉండాలి. పరీక్ష పేరుతో న్యాయవాదులను ఓటింగ్ కు దూరం చేయడం అన్యాయం. ​తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విషయంపై స్పందించి, డిసెంబర్ 14న జరగాల్సిన ఏపీపీ పరీక్షను మరో తేదీకి మార్చాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు నష్టం జరగకుండా చూడాలని ఆయన కోరారు.

Next Story