కరోనా మహమ్మారి దేశంలో ఎంతగా పాకుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే ఉన్నా కూడా కరోనా మహమ్మారి సోకుతోంది. ఇక కరోనా పరీక్షల కోసం వెళ్లిన వారు కూడా కరోనా బారిన పడుతూ ఉన్నారు. ఎంతో మంది టెస్టుల కోసం వెళ్లి కరోనా బారిన పడ్డట్లు తెలిపారు. పరీక్షల విషయంలో ఎంతో కన్ఫ్యూజన్ ప్రజల్లో ఉంది. ప్రజల వద్దకే కరోనా పరీక్షలు చేయడానికి ఓ వినూత్న ఆలోచన చేసింది అపోలో సంస్థ. పరీక్షా కేంద్రాల వద్ద ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరంలో అపోలో డయాగ్నస్టిక్స్ ఆర్‌టీపీసీఆర్ చేసే మొబైల్ పరీక్ష వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. జూబ్లీహిల్స్ పబ్లిక్‌స్కూల్‌లో గురువారం డ్రైవ్ త్రూ పేరుతో ఆర్టీపీసీఆర్ పరీక్షలను ప్రారంభించారు.
రోజుకు 250 మందికి టెస్ట్‌లు నిర్వహించే సామర్థ్యం ఈ వాహనం సొంతం. డ్రైవ్‌త్రూ వాహనం అందుబాటులో ఉందని.. సమీప ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అపోలో డయాగ్నస్టిక్స్ తెలిపింది. ఆన్‌లైన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్, పేమెంట్ ఉంటాయని, శాంపిల్ సేకరించిన 48 నుంచి 72 గంటల్లో ఫలితాలు మొబైల్ నెంబర్‌కు వస్తాయని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ, ఇతర సమస్యలను నివారించేందుకు ఈ వినూత్న డ్రైవ్‌ను ప్రారంభించామని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.