తెలంగాణలో గత కొన్ని రోజులుగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే తెలంగాణలో రాబోయే మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం, రాష్ట్రంలో శుక్రవారం తేలిక నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అన్నారు. శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వర్ష సూచనతో రైతులు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తూ ఉన్నారు. వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో గత 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని పంటలు దెబ్బ తిన్నాయి. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతూ ఉన్నారు.