కంచ గచ్చిబౌలి భూ వివాదంపై AIతో రూపొందించిన పోస్ట్‌ను Xలో రీషేర్ చేసినందుకు సైబరాబాద్ పోలీసుల నుండి నోటీసు అందుకున్న సీనియర్ IAS అధికారిణి స్మితా సబర్వాల్ తాజాగా ఆసక్తికరమైన ట్వీట్ పోస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్‌కు పర్యాటక శాఖ బాధ్యతలను అప్పగించింది. స్మితా సబర్వాల్‌ను రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్ స్పందించారు. భగవద్గీతలోని "కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన" శ్లోకాన్ని ఉటంకిస్తూ ఆమె తన పోస్ట్ పెట్టారు. పర్యాటక శాఖలో నాలుగు నెలలు పనిచేశాను. నా వంతుగా అత్యుత్తమంగా సేవలు అందించేందుకు ప్రయత్నించానన్నారు. రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 2025-30 పర్యాటక విధానాన్ని తీసుకువచ్చామని గుర్తు చేశారు.