ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌కు షాక్.. ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా
భారత రాష్ట్ర సమితి నాయకుడు, తెలంగాణ శాసన మండలి సభ్యుడు కసిరెడ్డి నారాయణరెడ్డి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేశారు.
By అంజి Published on 1 Oct 2023 7:14 AM GMTఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌కు షాక్.. ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకుడు, తెలంగాణ శాసన మండలి సభ్యుడు కసిరెడ్డి నారాయణరెడ్డి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు గత కొద్దిరోజులుగా అధికార బీఆర్‌ఎస్‌ని వీడిన రెండో ప్రముఖ నేత. నారాయణరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. రాజీనామాకు ముందు హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని నారాయణరెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు రాసిన తన రాజీనామా లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘కాంగ్రెస్, సోనియాగాంధీ ప్రకటించిన ఆరు హామీలు.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ద్వారానే అభివృద్ధిని చూస్తారనే ఆశాభావాన్ని నాకు కలిగించాయి, తెలంగాణ రాష్ట్ర సాధనలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారు. బీఆర్‌ఎస్ పార్టీకి నేను ఇందుమూలంగా రాజీనామా చేస్తున్నాను" అని ఆయన లేఖలో పేర్కొన్నారు. పది రోజుల క్రితం, సీనియర్ నాయకుడు, మల్కాజిగిరి నుండి ఎమ్మెల్యే అయిన మైనంపల్లి హనుమంత రావు తన కుమారుడికి సీటు నిరాకరించినందుకు పార్టీ నాయకత్వంతో వారాలుగా విభేదించి బీఆర్‌ఎస్ నుండి వైదొలిగారు.
గురువారం హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌కి టిక్కెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు సమాచారం. 119 మంది సభ్యుల తెలంగాణ అసెంబ్లీకి తదుపరి అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 2023లో లేదా అంతకు ముందు జరగాల్సి ఉంది.