'బాలాసోర్ తరహా రైలు ప్రమాదం' జ‌ర‌గ‌బోతోంది.. దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లేఖ

Anonymous Threatening Letter To South Central Railway. వచ్చే వారం హైదరాబాద్-ఢిల్లీ-హైదరాబాద్ మార్గంలో 'బాలాసోర్ తరహా రైలు ప్రమాదం' జ‌ర‌గ‌బోతోందంటూ

By Medi Samrat  Published on  3 July 2023 10:08 PM IST
బాలాసోర్ తరహా రైలు ప్రమాదం జ‌ర‌గ‌బోతోంది.. దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లేఖ

వచ్చే వారం హైదరాబాద్-ఢిల్లీ-హైదరాబాద్ మార్గంలో 'బాలాసోర్ తరహా రైలు ప్రమాదం' జ‌ర‌గ‌బోతోందంటూ హెచ్చరిస్తూ దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లేఖ వచ్చింది. గుర్తుతెలియ‌ని వ్య‌క్తి ఈ బెదిరింపు లేఖ‌ను రాశాడు. అప్రమత్తమైన అధికారులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంపై నార్త్‌ జోడ్‌ డీసీపీ చందనాదీప్తి మాట్లాడుతూ.. రైల్వే అధికారులకు హెచ్చరిక లేఖ వచ్చిందని ధ్రువీకరించారు. మూడు రోజుల కిందట రైల్వే అధికారులు తమకు సమాచారం అందించారని చెప్పారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు.

ఇదిలావుంటే.. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో 293 మంది ప్రాణాలు కోల్పోయారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఆ వెంట‌నే బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ బోల్తా పడిన కోచ్‌లను ఢీకొంది. సిఆర్‌ఎస్ విచారణతో పాటు రైలు ప్రమాదంపై సీబీఐ కూడా విచారణ జరుపుతోంది. ప్రమాదం తర్వాత ఆగ్నేయ రైల్వేకు చెందిన పలువురు ఉన్నతాధికారులను రైల్వే శాఖ బదిలీ చేసింది. రైలు ప్రమాదానికి సిగ్నల్స్‌పై నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వక జోక్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.


Next Story