మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ చైర్‌పర్సన్‌గా త్వరలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అమెరికాలో జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు.
“తెలంగాణ PPP విధానంలో నైపుణ్యాల పెంపుదల కోసం కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఆ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా ఉండమని ఆనంద్ మహీంద్రాను అభ్యర్థించాను. మరో రెండు రోజుల్లో యూనివర్సిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది’’ అని సీఎం చెప్పారు.
పిపిపి మోడల్‌లో రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఆగస్టు 1న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఆగస్టు 2న జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో రేవంత్ రెడ్డిని ఆనంద్ మహీంద్రా మర్యాదపూర్వకంగా కలిశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని స్వీకరించేందుకు అంగీకరించిన ఆనంద్ మహీంద్రాతో రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర అంశాలపై సీఎం చర్చించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. ఆనంద్ మహీంద్రా కంపెనీ ఒక బృందాన్ని యూనివర్సిటీని సందర్శించేందుకు పంపుతుందని చెప్పారు.
పరిశ్రమల సహకారంతో బీఎఫ్‌ఎస్‌ఐ, ఫార్మా, లైఫ్‌సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిటైల్, ఈ-కామర్స్ వంటి కొన్ని రంగాల్లో విద్యార్థులకు నైపుణ్యం పెంపొందించడంపై వర్సిటీ దృష్టి సారిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు గతంలో చెప్పారు.