హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ - బీజాపూర్ నేషనల్ హైవేపై తాండూరు డిపో బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కంకర మీద పడటంతో కొందరు అందులో కూరుకుపోయారు. టిప్పర్ డ్రైవర్ మృతి చెందాడు. బస్సు ముందు భాగం ధ్వంసమైంది.
ఘటన జరిగిన సమయంలో తాండూరు డిపోకు చెందిన బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడ్డవారిని చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం వల్ల చేవెళ్ల, వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.