కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి.. సీఎం రేవంత్ ఫ్లెక్సీలు తీస్తుండగా..
ఫ్లెక్సీలు తొలిగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు మృతి చెందారు.
By అంజి Published on 27 Dec 2024 10:31 AM IST
కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి.. సీఎం రేవంత్ ఫ్లెక్సీలు తీస్తుండగా..
ఫ్లెక్సీలు తొలిగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్‌లో గురువారం తెల్లవారుజామున జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం నాడు సీఎం రేవంత్ ఏడుపాయల దర్శనానికి వస్తున్నారని పోతంశెట్టిపల్లి నుంచి మెదక్ వరకు నేషనల్ హైవేపై భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కిష్టాపూర్ బస్టాండ్ సమీపంలో 11కేవీ కరెంట్ వైర్లకు సమీపంలో కూడా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సీఎం టూర్ తర్వాత కాంట్రాక్టర్ ఫ్లెక్సీలను తొలిగించాడు. అయితే కిష్టాపూర్ వద్ద ప్రమాదకరంగా ఉన్న ఫ్ల్లెక్సీని అలాగే వదిలేశాడు.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన నవీన్(21), ప్రసాద్(20) ఇద్దరు బుధవారం రాత్రి 10:40 సమయంలో పొలం దగ్గరి వెళ్లి వస్తుండగా రోడ్డుపై ఉన్న భారీ ఫ్లెక్సీని చూసి తొలిగించే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీకి సపోర్ట్‌గా ఉన్న తాళ్లు తొలిగించడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న 11కేవీ విద్యుత్ వైర్లపై పడింది. ఫ్లెక్సీ ఇనుప పైపులతో నిర్మించి ఉండటంతో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అటుగా వెళ్తున్న కొందరు లైన్‌మెన్‌కు సమాచారం ఇవ్వడంతో కరెంట్ ఆఫ్ చేసి మృతదేహాలను పక్కకు తీశారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై గౌస్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.