అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు యావత్ దళితులను దళితులను కించపరిచేలా ఉన్నాయని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. వ్యాఖ్యలపై అమిత్ షా భేషరతుగా క్షమాపణలు చెప్పడంతోపాటు, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. 25 శాతం ఉన్న దళితులకు హక్కులు అందడం లేదు.. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకునేలా బీజేపీ వ్యవహరిస్తుందన్నారు.
రెండు రోజుల క్రితం రాజ్యాంగంపై జరిగిన చర్చల్లో రాజ్యాంగంపై మాకు నమ్మకం ఉంది, రాజ్యాంగం మాకు అన్ని ఇచ్చిందని చెప్పిన బీజేపీ ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చే కుట్రకు తెరలేపిందన్నారు. అంబేద్కర్ ను కించపరిచేలాగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దళితులంతా ఏకమై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని సూచించారు. అంబేద్కర్ అంటే ఎంత చిన్నచూపు ఉందో అమిత్ షా వ్యాఖ్యలతోనే అర్థమవుతుంది.. అంబేద్కర్ చూపించిన మార్గంలో అందరం నడవాలన్నారు.