అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు.. ఐదుగురికి బెయిల్ మంజూరు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
By అంజి Published on 3 May 2024 10:08 AM GMTఅమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు.. ఐదుగురికి బెయిల్ మంజూరు
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. టిపిసిసి సోషల్ మీడియా టీం మెంబెర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నే సతీష్, నవీన్, అస్మా తస్లీమ్, గీత ఈ ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. నాంపల్లి కోర్టు విచారణ జరిపి నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి పదివేల రూపాయలు, ఇద్దరు పూచీ కత్తులతో కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిందితులు ప్రతి సోమవారం, శుక్రవారం కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
టిపిసిసి సోషల్ మీడియా టీంలో పెండ్యాల వంశీకృష్ణ, మన్నే సతీష్, నవీన్ అస్మా తస్లీమ్, గీత ఈ ఐదుగురు పనిచేస్తున్నారు. వీరు రాజకీయ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను పర్యవేక్షించడమే కాకుండా వాటిని వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్స్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఏప్రిల్ 23వ తేదీన మెదక్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. అయితే ఆ వీడియోను నిందితులు మార్ఫింగ్ చేశారు. ఆ విధంగా మార్కింగ్ చేసిన వీడియోను కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్స్‌లో అప్లోడ్ చేయడమే కాకుండా వివిధ వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశారు. అయితే ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో చక్కెరలు హల్చల్ చేసింది.
దీంతో ఏప్రిల్ 27వ తేదీన రాత్రి 8:30 గంటల ప్రాంతంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తన ట్విటర్లో అమిత్ షా మార్ఫింగ్ వీడియోను పోస్ట్ చేశారని అట్టి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని విచారించిన అనంతరం ఈరోజు ఉదయం నాంపల్లి కోర్టులో హాజరపరిచారు. కోర్టు ఇరువాదనలు విన్న అనంతరం నిందితులకు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది.