రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ సర్కారు మాయం

Amit Shah Addresses Munugodu Public Meeting. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ‘మునుగోడు సమరభేరి’

By Medi Samrat  Published on  21 Aug 2022 1:59 PM GMT
రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ సర్కారు మాయం

మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. 'మునుగోడు సమరభేరి' పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ స‌భ‌కు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. స‌భా వేదిక‌పై రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి అమిత్‌షా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి చేరారని అన్నారు. ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ అవినీతి సర్కారు మాయం అవుతుందన్నారు.

కేసీఆర్‌ సర్కార్‌.. అబద్ధాలకోరు ప్రభుత్వం అని విమ‌ర్శించారు. పేదవారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేసీఆర్‌ ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు. నిరుద్యోగులకు రూ.3వేలు భృతి ఇస్తామని కేసీఆర్‌ మాట తప్పారని దుయ్య‌బ‌ట్టారు. ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు.. నల్లగొండ జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ప్రారంభం అయ్యిందా.. అంటూ ప్రశ్నించారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి అందిందా?. గిరిజనులకు భూమి ఇస్తానని చెప్పి ఇచ్చారా?. ఉద్యోగాలు కేసీఆర్‌ కుటుంబానికి తప్ప ఎవరికీ దక్కలేదని మండిపడ్డారు.

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్‌ మాట తప్పారని విమ‌ర్శించారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ వస్తారని అన్నారు. ఎంఐఎం భయంతోనే కేసీఆర్ ప్ర‌భుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపట్లేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపిస్తామని అమిత్‌షా స‌భా వేదిక నుండి ప్రకటించారు.


Next Story