ఆ ఇద్దరి ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం
ఉర్దూ వార్తాపత్రిక ది సియాసత్ డైలీ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు ఆమోదం పొందారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Jan 2024 6:14 PM ISTహైదరాబాద్ : ఉర్దూ వార్తాపత్రిక ది సియాసత్ డైలీ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు ఆమోదం పొందారు. తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని భర్తీ చేస్తూ శనివారం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తన కార్యాలయంలో వారిద్దరినీ అభినందించారు.
MLC నామినేషన్లకు సంబంధించిన పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023లోనే పంపింది. అభ్యర్థులకు రాజకీయ సంబంధాలను చూపుతూ గత భారత రాష్ట్ర సమితి (BRS) ప్రభుత్వం సూచించిన దాసోజు శ్రవణ్ , కుర్రా సత్యనారాయణ నామినేషన్‌లను గవర్నర్ గతంలో తిరస్కరించారు. తెలంగాణ శాసనమండలికి గవర్నర్ నామినేట్ చేసిన ఇద్దరు సభ్యులు డి.రాజేశ్వర్ రావు, ఫారూఖ్ హుస్సేన్ పదవీకాలం 27 మే 2023తో ముగిసింది. ఈ స్థానాలను గవర్నర్ నామినేషన్ ద్వారా భర్తీ చేయాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 (కేంద్ర చట్టం 43 ఆఫ్ 1951)లోని సెక్షన్ 156, 157 ప్రకారం, గవర్నర్ నామినేట్ చేసే సభ్యుని పదవీకాలం సెక్షన్ 74 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి ఆరు సంవత్సరాలు ఉంటుంది.
ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థులు
ఎమ్మెల్యేల కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ లు అభ్యర్థులుగా నిలిచారు. భారత ఎన్నికల సంఘం (ECI) జనవరి 29న ఎమ్మెల్యే కోటా కింద ఖాళీగా ఉన్న రెండు MLC స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలను షెడ్యూల్ చేసింది. BRS MLCలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత రాజీనామా చేయడంతో ఎన్నికలు జరపాల్సి వచ్చింది.
బీఆర్‌ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది
ప్రస్తుతం, తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో 27 మంది సభ్యులతో BRS ఆధిపత్యం చెలాయించగా, అమీర్ అలీ ఖాన్, కోదండరామ్‌ల నియామకంతో.. భారత జాతీయ కాంగ్రెస్ (INC)కి ఇప్పుడు నలుగురు MLCలు, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM)కి ఇద్దరు ఉన్నారు. బీజేపీ, తెలంగాణ జనసమితి (టీజేఎస్)లకు ఒక్కో సభ్యుడు ఉండగా, మిగిలిన ఇద్దరు స్వతంత్రులు. తెలంగాణ ఉద్యమ సమయంలో బాగా వినిపించిన పేరు ప్రొఫెసర్ కోదండరామ్.. ఆ తర్వాత ఆయన పలు పొలిటికల్ పార్టీలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ టీజేఏసీ చైర్మన్‌గా ఉన్నారు. 2023లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి ప్రొఫెసర్ కోదండరామ్ పదవీ విరమణ చేశారు.
గవర్నర్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్
తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం కోదండరామ్‌ను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తప్పుబట్టారు. కీలక నిర్ణయాల విషయంలో గవర్నర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్సీ పదవులకు నామినీలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గవర్నర్ గతంలో ఎలా తిరస్కరించారని ప్రశ్నించారు కేటీఆర్.